కరోనా కట్టడికి సర్కార్ లాక్ డౌన్ ప్రకటించింది. జనహితం కోసం అనివార్యమైన చర్యగా పేర్కొంది. లాక్ డౌన్ పై నిర్లక్ష్యం వద్దని, విదేశాల్లోని నష్టాన్ని చూసి కళ్లు తెరవాలని సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సూచిస్తున్నారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్రాలకు ఆదేశాలు వచ్చాయి. కానీ తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆదేశాలను జనం పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. అవసరం ఉన్నా, లేకపోయినా వీధుల్లో వీరవిహారం చేస్తున్నారు.

1 / 8

సర్కారు ఇచ్చిన సడలింపులను దుర్వినియోగం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ తీవ్రంగా ఆందోళన చెందారు. ‘కరోనా’ తీవ్రతను జనం పట్టించుకోవడం లేదని కలత చెందారు. ఇందుకు బలమైన కారణం లేకపోలేదు. విదేశాల నుంచి 820 మంది సిరిసిల్ల జిల్లాకు వచ్చినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తూ, విదేశాల నుంచి వచ్చినవారికి స్టాంపులు కూడా వేస్తున్నారు. కానీ లాక్ డౌన్ ఆదేశాలను పాటించకుండా అనేక మంది రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ కృష్ణభాస్కర్ సోమవారం స్వయంగా రోడ్డెక్కారు. జనాన్ని స్వయంగా హెచ్చరిస్తున్నారు. ‘ఎవరు? ఏం పని? ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు?’ అని నిలదీస్తున్నారు. ‘కారు పక్కన పెట్టు, తర్వాత సంగతి’ అని హెచ్చరిస్తున్నారు.

ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు రోడ్డుపైకి వచ్చారు. తంగళ్లపల్లి మండలానికి చెందిన గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్ గా పేర్కొంటున్న ఇతను రోడ్డుపైకి రావడమేగాక, అందుకు సరైన కారణం చెప్పకుండా ‘నేనెవరో తెలుసా? లీడర్ ను గౌరవించడం తెలియదా? అని ఓ సీఐతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. చేసేది లేక ఆ సీఐ విషయాన్ని అక్కడే గల కలెక్టర్ కృష్ణభాస్కర్ దృష్టికి తీసుకువెళ్లారు. ‘లీడర్ అయితే మరింత బాధ్యతగా ఉండాలి కదా? కరోనాపై ప్రజలను చైతన్యవంతం చేయాలి కదా? ఇదేం పద్ధతి?’ అని కలెక్టర్ హితవు చెప్పినా శ్రీకాంత్ గౌడ్ వినిపించుకోకుండా మళ్లీ వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్ ఆదేశం మేరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తిపై కట్టడికి తీసుకుంటున్న చర్యలపై క్రమశిక్షణ పాటించని జనం గురించి సిరిసిల్ల కలెక్టర్ కష్ణభాస్కర్ తీవ్ర ఆందోళనతో రంగంలోకి దిగి, రోడ్డెక్కి మరీ తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన ఫొటోలను, వీడియోను ఇక్కడ చూడండి.

Comments are closed.

Exit mobile version