ప్రస్తుతం ప్రతి ఆదివారం పాతిక వేల మంది. మరో 30 రోజుల తర్వాత కేవలం నాలుగు రోజుల్లో 1.20 కోట్ల మంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం జాతరకు హాజరయ్యే భక్తుల సంఖ్య ఇది. ఎవరో చెప్పిన కాకి లెక్కలు కావివి. సాక్షాత్తూ తెలంగాణా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తాజాగా శుక్రవారం చెప్పిన వివరాలివి. ఇదిగో ఇంత పెద్ద జాతరలో అక్షరాలా రూ. 75 కోట్ల విలువైన జాతర సౌకర్యాల పనుల తీరుపై అధికార పార్టీ నేతలు భగ్గుమన్నారట. ఒకరు కాదు, ఇద్దరు కాదు… దేవాదాయ, గిరిజన, పంచాయత్ రాజ్ శాఖలకు చెందిన ముగ్గురు మంత్రులు, ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు.. అబ్బో అనేక మంది అధికార పార్టీ నేతలు వివిధశాఖల అధికారుల పనితీరుపై అగ్గిలం మీద గుగ్గిలమైనట్లు వార్తా కథనాలు. జనవరి మొదటి వారంలో పనులు పూర్తి చేస్తామని చెప్పి మరో 20 రోజుల వ్యవధి పడుతుందని పాత ‘కత’లే చెబుతున్నారని పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇదే దశలో స్థానిక ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా జాతర పనులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మేడారం జాతర పనులు కాంట్రాక్టర్లకు ఉపయోగపడేలా ఉన్నాయే తప్ప, భక్తులకు ఉపకరించేవిధంగా లేవన్నారు. మేడారంలో ‘టూత్ పాలిష్’ పనులు చేస్తున్నారని, వీటిపై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. వరంగల్-హైదరాబాద్ హైవే పనులు నత్తనడకన సాగుతున్నాయని, గత జాతరలో పనులు ఎలా సాగాయో, రెండేళ్ల తర్వాత కూడా తీరు మారలేదని, ఆత్మకూరు వద్ద ఇప్పుడు రోడ్లు తవ్వుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8 వరకు జరగనున్న మేడారం జాతర పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు అధికార పార్టీకి చెందిన అనేక మంది నేతలు అధికారుల పనితీరుపై భగ్గుమన్నారు కదా?

ఇక్కడ సీన్ కట్ చేద్దాం. జాతర సమీపిస్తోంది కాబట్టి అధికార పార్టీ నేతల హడావిడి సహజంగానే భావిద్దాం. కానీ జాతర విషయంలో అసలు అధికార పార్టీ నాయకులే కాదు, ప్రభుత్వం అనుసరించిన వైఖరేమిటి? ఇదీ అసలు ప్రశ్న అంటున్నారు భక్తులు. ప్రతి రెండేళ్లకోసారి జాతర జరుగుతుందనే విషయం పాలకులకే కాదు, అధికార గణానికీ తెలుసు. జాతర తేదీలు సైతం ఎప్పుడో ఖరారయ్యాయి. కానీ పనుల నిర్వహణకు ప్రభుత్వం కేవలం రెండు నెలల ముందు నిధులు మంజూరు చేయడం గమనార్హం. కేవలం 60 రోజుల ముందు నిధులు విడుదల చేసి, రూ. 75 కోట్ల నిధులు ఖర్చు చేయాలనే ఆతృతలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత ఏపాటిదనే ప్రశ్న సహజం. అన్నీ ‘తూట్ పాలిష్’ పనులని ములుగు ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించడంలో అర్థం ఇదే కాబోలు.

మేడారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

ఓకే… నిధుల విడుదల విషయాన్ని కాసేపు పక్కన బెడదాం. అసలు మేడారంలో జరుగుతున్న పనులపై పూర్తి స్థాయి పర్యవేక్షణ అధికారం ప్రస్తుతం ఎవరికి ఉంది? ఇది కూడా మరో ప్రశ్న. ట్రస్టు బోర్డు అనే పదాన్ని పూర్తిగా మర్చిపోయే విధంగా ‘పునరుద్దరణ’ కమిటీల నియామకం వైపే పాలకులు మొగ్గు చూపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అమ్మవార్ల జాతర జరిగే గద్దెల ప్రాంగణాన్ని దాటి అడుగు ముందుకేసి ఏ పని తీరునూ ప్రశ్నించే అధికారం లేని ‘పునరుద్దరణ’ కమిటీల వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి? అడిగేవారెవరూ లేనందువల్లే ఎమ్మెల్యే సీతక్క పరిభాషలో ప్రస్తుతం అక్కడ ‘తూట్ పాలిష్’ పనులు జరుగుతున్నట్లు భావించక తప్పదు మరి.

సరే నిధుల విడుదల, ట్రస్టు బోర్డు అంశాలను సైతం కాసేపు వదిలేద్దాం. ఉదాహరణకు ఓ ఇంట్లో ఏధేని శుభ కార్యం జరిగితేనే మనం ఎంతో హడావిడి చేస్తుంటాం. వందల్లో వచ్చే అతిథులకు, బంధువులకు సౌకర్యాల కల్పనలో నానా హైరానా పడుతుంటాం కదా? సరిగ్గా శుభకార్యం సమీపించే సమయంలో ఇంటి యజమానిని అక్కడి నుంచి అకస్మాత్తుగా వేరే ప్రాంతానికి పంపించి, మరో ఇంటి బాధ్యతలకు పురమాయిస్తే? పక్కింటి వ్యక్తిని ‘ఇంచార్జ్’ పద్ధతిలో కాస్త పనులు చూడాలని కోరితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదిగో మేడారం జాతర పనుల దుస్థితి కూడా ఇదేనంటున్నారు భక్తజనం.

కాంట్రాక్టర్లకు, అధికారులకు డెడ్ లైన్ విధించి పనులు పూర్తికి కఠిన ఆదేశాలు జారీ చేసిన ములుగు కలెక్టర్ నారాయణరెడ్డిని ప్రభుత్వం ఆకస్మికంగా నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేసిన నేపథ్యాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యే జాతర పరిధికి చెందిన కలెక్టర్ ను ఉన్నట్టుండి బదిలీ చేయడంపై ఉద్భవిస్తున్న ప్రశ్నలకు బహుషా ‘టూత్ పాలిష్’ పనులు సమాధానం కావచ్చు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఇంచార్జిగా ఉన్నప్పటికీ, ఇంతకు ముందు కథనాల్లో చెప్పుకున్నట్లు, పనులపై ఆయనకు పట్టు లభించే సరికే జాతర ముంచుకొస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న స్థితి కూడా ఇదేనంటున్నారు. జాతర విషయంలో ఇటువంటి అనేక కీలక అంశాలను విస్మరించిన అధికార పార్టీ నేతలు మేడారంలో సమీక్షా సమావేశం నిర్వహించి అధికార యంత్రాంగం మీద అగ్గిలం మీద గుగ్గిలం అయినంత మాత్రాన అసలు సమస్య పరిష్కారం కాదన్నది భక్తుల అభిప్రాయం. మొత్తంగా మేడారం జాతరలో ‘టూత్ పాలిష్’ పనుల నిర్వహణ తీరు ఎవరికి ప్రయోజనమంటారు? ఏమో…చిలకల గుట్టపై గల ఆ సమ్మక్క తల్లికే తెలియాలి మరి.

Comments are closed.

Exit mobile version