జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై తెలంగాణా రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాలను ప్రస్తావించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ జేఎన్ యూ సొసైటీకి ఇంటి స్థలం అప్పగించామని, ప్రతి జర్నలిస్టుకు రూ. 3 కోట్ల విలువైన భూమి ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
అదేవిధంగా వరంగల్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు ఫైల్ ను తెప్పించుకుని త్వరలోనే క్లియర్ చేస్తానన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంలో ఇటు ప్రభుత్వానికి, అటు మీడియా అకాడమీ చైర్మెన్ కు క్లారిటీ ఉందన్నారు. ప్రతి జర్నలిస్టుకు ఎన్ని గజాల ఇంటి స్థలం ఇవ్వాలనే అంశంపై క్లారిటీ ఇస్తూ, ఒక దగ్గర ఎక్కువ, మరో దగ్గర తక్కువ ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదన్నారు.
కొత్తగా డబ్బు కట్టించుకునేవారి విషయంలో అన్ని జిల్లా కేంద్రాల్లో యూనిఫామ్ గా ఒక ఫార్మేట్ పెట్టుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఈ పద్ధతిలో పదేళ్లా? పదిహేనేళ్లా? ఇరవై ఏళ్ల అనుభవమా? అనే అంశంలో సీనియారిటీని బట్టి కేటాయింపుగాని, తుది నిర్ణయాన్నిగాని మీడియా అకాడమీ చైర్మెన్, జర్నలిస్టులే నిర్ణయించుకోవాలన్నారు.
రాబోయే రోజుల్లో కొత్తవాళ్లకు, నిన్నా, మొన్నా వచ్చినవాళ్లకు హడావిడి పడి ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి ఉండదని తేల్చి చెప్పారు. కార్డులు ఉన్నవాళ్లకు, ఆ కార్డులు కూడా ఏదేదో కాకుండా, పర్ఫెక్టుగా, ఇండెప్తుగా కమిటీ ఫైనల్ చేసుకోవాలన్నారు. కుప్పలు తెప్పలుగా… ఏదో వచ్చి మీడియా మిత్రున్ని అంటే సీనియర్లకు నష్టం జరుగుతుందని, అలా చేసే ఉద్ధేశం తమకు లేదని స్పష్టం చేశారు.
అందువల్ల ఉన్నదాంట్లో న్యాయం చేస్తూ తుది జాబితాలకు ముగింపు ఇస్తూ వీలైనంత త్వరగా జర్నలిస్టులే తయారు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీని ఫైనల్ చేస్తామన్నారు. ఈ పాలసీలో ఫిట్ అయినవాళ్లకు ఫస్ట్ ఫేస్ లో ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి వివరించారు.