కాబోయే ముఖ్యమంత్రిగా ప్రాచుర్యంలో గల తెలంగాణా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరికొద్ది సేపట్లో ఖమ్మం నగరానికి చేరుకోనున్నారు. ఆయన రాక సందర్భంగా ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలను అధికార యంత్రాంగం అత్యంత శుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చి దిద్దింది. ప్రధాన రహదారులతోపాటు లకారం టాంక్ బండ్ తదితర ప్రాంతాలను సుందరంగా, రమణీయంగా తీర్చిదిద్దారు. కేటీఆర్ రాక సందర్భంగా ఖమ్మం నగరంలోని కొన్ని ప్రాంతాలు శనివారం రాత్రి నుంచే కళకళలాడుతున్నాయి. విద్యుత్ దీపాల వెలుగులో మరికొన్ని ప్రాంతాలు జిగేల్ మంటున్నాయి. ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా కేటీర్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇటువంటి అత్యవసర ‘కష్టాలు’ పడడం సహజమే… ఇది కొత్త ప్రక్రియేమీ కాదు. కానీ…
ఇదే దశలో అధికార యంత్రాంగానికిగాని, ప్రజలు ఎన్నుకున్న స్థానిక ప్రజాప్రతినిధులకు గాని ఏమాత్రం పట్టింపు లేని ప్రాంతాలు కూడా ఖమ్మం నగరంలో అనేకం ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజల నుంచి అన్ని రకాల పన్నులను వసూలు చేసుకుంటున్న నగర పాలక సంస్థ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం చెందుతున్నారనే విమర్శలూ లేకపోలేదు. ఖమ్మం నగరంలోని 34వ డివిజన్ దుస్థితి పట్టణ ప్ర‘గతి’కి ఓ నిదర్శనం మాత్రమేనని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీ సౌకర్యం లేక, మురుగు నీరు ఎటు వెళ్లాలో తెలియక మురికి కూపంగా మారిన 34వ డివిజన్ లోని తాజా దుస్థితిని దిగువన స్లైడ్ షోలో చూడవచ్చు. మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇటవంటి ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేసి, క్షేత్ర స్థాయి దుస్థితిని స్వయంగా తిలకించి, తమ సమస్యలను పరిష్కరించాలని, అధికార గణానికి ఆదేశాలు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.