నిఘా వర్గాల నివేదికలు… అదేనండీ ఇంటెలిజెన్స్ విభాగపు రిపోర్టులు అత్యంత రహస్యంగా ఉంటాయని భావిస్తుంటారు. మూడో కంటికి తెలియకుండా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలు తమ పని తాము చేసుకుపోతుంటాయని పేరుంది. పోలీసు శాఖకు చెందిన ఈ రెండు నిఘా విభాగాలు ప్రభుత్వానికి, ముఖ్యంగా పాలకవర్గాలకు కళ్లు, చెవులు, ముక్కులుగా భావిస్తారనే ప్రాచుర్యం ఉంది. ప్రభుత్వ విధానాలపై ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాలపైనేగాక, శాంతిభద్రతల పరిరక్షణ అంశంపైనా ఎప్పటికప్పుడు రహస్య నివేదికలను అందిస్తూ, సంఘ వ్యతిరేక శక్తుల ఆటకట్టించేందుకు ఈ విభాగాలు ఎక్కువగా దోహదపడుతుంటాయి.
నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంచలన ప్రకటన గురించి తెలిసిందే. తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న కొన్ని అరాచకశక్తులు హైదరాబాద్ నగరంలోనేగాక, తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు స్పష్టించి, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని సీఎం వెల్లడించారు. ఇటువంటి కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని, ఆయా శక్తులపట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇదిగో ఈ నేపథ్యంలోనే… ‘బయటపడ్డ ఇంటెలిజెన్స్ నివేదిక’ అనే ఓ హెడ్డింగును తగిలించి, ఇంకో, రెండు మూడు వాక్యాలను కూడా అనుసంధానించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘టాప్ సీక్రెట్’ పేరుతో గల ఓ మెయిల్ సోషల్ మీడియాలో తిరుగుతుండడమే అసలు విశేషం. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు మతపరమైన ఇబ్బందులను కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని, వివిధ మత ప్రార్థనా స్థలాల వద్ద అభ్యంతరకర మెటీరియల్ ను విసిరేసి ఇటువంటి చర్యలకు పాల్పడవచ్చని వివిధ ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తున్నదని మెయిల్ సారాంశం.
ఈ విషయంలో అనుసరించాల్సిన అప్రమత్తతను బోధిస్తూ ఉన్నతాధికారుల నుంచి జిల్లా పోలీస్ యూనిట్లకు అందిన మెయిల్ బయటకు ఎలా లీకైందనేది చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఇది అసలు మెయిలేనా? లేక ఏవేని శక్తులు తయారు చేసిన నకిలీ మెయిలా? అనే అంశంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ‘టాప్ సీక్రెట్’గా ఉంచాల్సిన ఈ విషయం సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. అదీ అసలు విషయం.