న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్యోదంతపై తెలంగాణా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. న్యాయవాదుల హత్యపై రిపోర్టును సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని సూచించింది.
అంతేగాక ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయవాదుల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేదిగా ఉందని, ప్రభుత్వం తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవాదుల హత్య గర్హనీయమని, నిందితులను పట్టుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసు విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది.
కాగా న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు నిరసనకు దిగారు. పలుచోట్ల విధులను బహిష్కరించి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.