‘హైకోర్టు ఏం చెప్తది? కొడ్తదా? సంకల సంస్కాన ఉంటెనే కదా? ఇచ్చేది? హైకోర్టుకు దీనిపై తీర్పు చెప్పే అధికారం లేదు.’ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 25వ తేదీన విలేకరులతో చేసిన వ్యాఖ్యలివి.
‘కోర్టు అలా అనలేదు. అనజాలదు. అనడానికి కోర్టుకు అధికారం లేదు. ఎట్ల అంటదండీ? మేం ఫైల్ చేసిన అఫిడవిట్ మీద మాట్లాడాలె. అవతల పక్క అడ్వకేట్ ఏదో అంటడు. కానీ కోర్టు అనలేదు. ఆయనెవరో అడ్వకేట్ తప్పుడు మాటలు మాట్లాడిండు. ఏదో డాక్యుమెంట్ పట్టుకొచ్చి మాట్లాడిండు. అది అంతర్గత డాక్యుమెంట్. మంత్రికిచ్చిన ప్రజంటేషన్ డాక్యుమెంట్ అది. దాని మీద ఏమైనా సంతకం ఉంటదా అండీ? హైకోర్టు అంటలేదు. అది ఎవడో అడ్వకేట్ అంటుండు.’ ఆర్టీసీ ఎండీపై హైకోర్టు మండిపడిందనే ప్రశ్నలకు ఈనెల 2వ తేదీన కేసీఆర్ స్పందించిన తీరు ఇది.
‘అట్ల కామెంట్ చేయడానికి హైకోర్టుకు కూడా అధికారం లేదు. ప్రభుత్వం కదా…డబ్బులు ఇచ్చేది. ఒక్క హుజూర్ నగర్ కే ఇస్తదండీ? మేం పాలకు కూడా రూ. 4 ప్రోత్సాహకం కింది ఇస్తున్నం. రూ. 2 వేలు ఫించన్ ఇస్తున్నం. రూపాయికి కిలోబియ్యం ఇస్తున్నం. వికలాంగులకు రూ. 3 వేలు ఫించన్ ఇస్తున్నం. చాలా ఇస్తుంటం. చాలా ఇస్తం. ప్రభుత్వం ఒకటి ఇస్తదా? నువ్వు గాడ ఎట్ల ఇచ్చినవ్? ఈడ ఎట్ల ఇచ్చినవ్? అంటరు. అలా ఉంటదానండీ లెక్క? ఆ పని మాది కదా?’ ఉప ఎన్నికలు జరిగిన హుజూర్ నగర్ కు రూ. 100 కోట్లు ఇచ్చిన ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకు ఇవ్వడానికి రూ. 47 కోట్లు లేవా? అని హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా గత నెల 2వ తేదీన విలేకరుల సమావేశంలో కేసీఆర్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే కదా?
‘బయట ఎల్లయ్య ఏదో మాట్లాడుతడు. ఓ సీంను, నన్ను పట్టుకుని అడుగుతవానవయా? సోయి ఉండి మాట్లాడాలె. నువ్వు ఏ పేపర్ విలేకరివో నాకు తెల్వది. ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నవ్?’ అంటూ అదే రోజు ఓ పాత్రికేయుడిపై గుడ్లురిమారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడో స్తంభమైన న్యాయవ్యవస్థను తప్పుపట్టడం, నాలుగో స్తంభమైన పాత్రికేయ రంగంపై గుడ్లు ఉరమడం ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందనే చెప్పాలి. ప్రభుత్వం మంజూరు చేసే నిధుల గురించి ప్రశ్నించే హక్కు హైకోర్టుకు లేదనే భావన గల కేసీఆర్ వ్యాఖ్యలకు పరోక్షంగా గురువారం అదే హైకోర్టు సరైన రీతిలో జవాబు చెప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ కార్మికులకు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించిన 47 కోట్ల నిధుల అంశాన్ని హైకోర్టు మళ్లీ ప్రస్తావించడం గమనార్హం. రైతుబంధు పథకాన్ని, కాళేశ్వరం వంటి పథకాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఔదార్యం తీరును నేరుగానే ప్రశ్నించింది. ప్రాజెక్టుల నిర్మాణంతో 80 శాతం నీటి అవసరాలు తీరుస్తున్నదని కేసీఆర్ పదే పదే ఉపయోగించే ’అద్భుతం‘ అనే పదాన్ని ప్రయోగించడం గమనార్హం. ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందని అడ్వకేట్ జనరల్ జోక్యం చేసుకుని చెప్పగా, అదే అప్పులో మరో రూ. 47 కోట్లు తెస్తే ఏమవుతుందని ప్రశ్నించడం గమనార్హం. ఈ ప్రశ్నలో చాలా అర్థం దాగి ఉందని ఉందని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతాన్ని మరిచిపోయేవారు తమ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని నెహ్రూ చెప్పిన విషయాన్ని గుర్తించాలని హైకోర్టు హితవు చెప్పింది. బలవంతమైన సామ్రాజ్యాలు ఎదగడాన్ని, కూలడాన్ని తెలంగాణా ప్రజానీకం చూసిందని హైకోర్టు చేసిన వ్యాఖ్య కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ‘పరశురాముడి ముందే విష్ణువు తల వంచాడు. రాజనేవాడు ప్రజలకు తండ్రిలాంటివాడు.’ అని హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ సమ్మె అంశంలో పాలకుల తీరును ఎండగట్టినట్లేనని న్యాయవాద వర్గాలు పేర్కొంటున్నాయి. ‘మా దగ్గర కోర్టు ధిక్కరణ అధికారం ఉంది. మీ అఫిడవిట్లు కోర్టు ధిక్కారమే’నంటూ హైకోర్టు వ్యాఖ్యానించడాన్ని పలు విధాలుగా అన్వయించుకోవచ్చని న్యాయవాద వర్గాలు అంటున్నాయి. ఇక ప్రజాస్వామ్యంలో ఒకటో స్తంభమైన ఎగ్జిక్యూటివ్ విభాగంలోని ఐఏఎస్ అధికారులకు హైకోర్టు తలంటిన సంగతి తెలిసేందే. తన పదిహేనేళ్ల జడ్జి చరిత్రలో ఇన్ని అబద్దాలు చెప్పే అధికారులను చూడలేదని, తాను మూడు రాష్ట్రాల్లో పనిచేశానని, ఎవరూ ఇలా అబద్ధాలు చెప్పలేదని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మపై చేసిన వ్యాఖ్యలు ఎగ్జిక్యూటివ్ అధికారులకే కాదు ప్రభుత్వ తీరును కూడా ఎండగట్టినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసే నేతలు కోర్టులు తమ అధికారాన్ని వినియోగిస్తే ఫలితం ఎలా ఉంటుందో, దాని ప్రభావం మరెంతగా ఉంటుందో గతంలో అనేక ఘటనలు నిదర్శనంగా నిలిచాయని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘కోర్టు సలహా ఇవ్వడం వేరు…నిర్దేశించడం వేరు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలను గ్రహించే పాలకులు న్యాయవ్యవస్ధతో ఘర్షణ వైఖరి అవలంభించరు’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ‘మేం 48 వేల మంది ఆర్టీసీ కార్మికుల గురించి ఆలోచించడం లేదు. మూడు కోట్ల మంది ప్రజల గురించి ఆలోచిస్తున్నాం. మీరన్నా…ప్రభుత్వమన్నా మాకు గౌరవం ఉంది’ అని హైకోర్టు చేసిన వ్యాఖ్యల అంతరంగాన్ని పాలకులు ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరముందని న్యాయవాద వర్గాలు గుర్తు చేస్తున్నాయి. హైకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వ సారథి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.