కరోనా వైరస్ కు చంపే శక్తి లేదని తెలంగాణా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు. అయితే నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ లోని రెసిడెన్షియల్, కాలనీ అసోసియేషన్లతో సమావేశమైన మంత్రి మాట్లాడుతూ, కరోనా బారినపడ్డ 95 శాతం మందికి హాస్పిటల్ చికిత్స అవసరం లేకుండానే నయం అవుతోందని, 5 శాతం మందిలోనే చికిత్స అవసరమన్నారు.
ఇటువంటి వారికి కూడా చికిత్సకు అత్యధికంగా లక్ష రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని, కానీ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రం 30 లక్షల రూపాయలు వసూలు చేయడం సబబు కాదన్నారు. ఈ సమయంలో వ్యాపారం చేయవద్దని వారికి చెప్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ కి వెళ్లి అప్పుల పాలు కావద్దని ప్రజలకు మంత్రి సూచించారు.
ప్రపంచంలో కరొనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయని, అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదని, ప్రచారం జరగలేదని, కానీ ఇప్పుడు ఎక్కువ భయపడుతున్నారని మంత్రి అన్నారు. ముందుగా ఆ భయాన్ని పోగొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసిందని చెప్పుకొచ్చారు. దేశం నలుమూలల ఏ మంచి కార్యక్రమం జరిగినా దాన్ని అనుసరించామని. ఆ చికిత్సలను మన వారికి అందిస్తున్నామని చెప్పారు.
పట్టణ పేద ప్రజల ముంగిటికి వైద్య సేవలు తీసుకురావడమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలను తీసుకువచ్చామన్నారు. ఇప్పటికీ 200 ప్రారంభించామని, మరో 100 బస్తీ దావాఖానాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. బస్తీ దావాఖానాల్లో సాయంత్రం క్లినిక్ లు కూడా ప్రారంభించామని, వీటిలో మందులకు కొదువ లేదన్నారు. వారం రోజుల నుండి తెలంగాణలో రోజుకు 50 నుండి 60 వేల టెస్టులు చెస్థున్నామని, కరోనాను ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చని, అందుకే పరీక్షల సంఖ్య పెంచామన్నారు. దేశంలోకంటే తెలంగాణలో మరణాల శాతం తక్కువ ఉందన్నారు.