తెలంగాణాలో కరోనా వైరస్ కు సంబంధించి ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. వచ్చే సెప్టెంబర్ నెలాఖరు వరకు తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో కరోనా కేసుల రికవరీ సంఖ్య పెరిగిందని, మరణాల రేటు తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.
అదేవిధంగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయన్నారు. తెలంగాణాలో ప్రతిరోజూ
23 వేల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. గ్రేటర్ లో ఆగస్టు చివరి వరకు చాలా వరకు కరోనా కేసులు తగ్గుతాయని అంచనా వేస్తున్నామని, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం కేసుల పెరుగుదల కనిపిస్తున్నదని చెప్పారు.
ఇదే దశలో జిల్లా కేంద్రాల్లో కరోనా విస్తరిస్తోందని, కరోనా కట్టడికి మరో వంద కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసిందన్నారు. కరోనా కట్టడికి ధైర్యమే మందు అని చెబుతూ, కరోనా వచ్చిన వారికి రెండు వారాలు మాత్రమే ఉంటుందని, రెండో వారంలో కూడా కొంత మందిని వైరస్ ఇబ్బంది పెడుతోందన్నారు.
కరోనా మరణాల శాతం తగ్గించడానికి కృషి చేస్తున్నామని, హోమ్ ఐసోలేషన్ కిట్స్ వెంటనే అందిస్తున్నామని, ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని, రెమిడిసివిర్ మందును అందుబాటులో ఉంచామన్నారు.
ప్రయివేటు ఆస్పత్రులపై ఇప్పటి వరకు 1,039 ఫిర్యాదులు వచ్చాయని శ్రీనివాసరావు చెప్పారు. బిల్లులకు సంబంధించి 130కి పైగా, 16 ఇన్సూరెన్స్ కు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు. అయితే ఫిర్యాదుల నేపథ్యంలో ఆస్పత్రులు మూసి వేయడం తమ ఉద్దేశం కాదని, ప్రయివేటు ఆస్పత్రుల నిర్వాహకులకు కౌన్సెలింగ్ చేస్తున్నామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరించారు.