తెలంగాణా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలపై, వివిధ శాఖల ద్వారా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, స్టాల్స్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సందర్శించి తిలకించారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న గవర్నర్ కలెక్టరేట్ ఆవరణలో ఫోటో ఎగ్జిబిషన్, స్టాళ్లను సందర్శించి తిలకించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వివిధ శాఖల ద్వారా ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్ కు వివరించారు. పర్యాటక ప్రదేశాలపై సమాచార శాఖ, జిల్లా పర్యాటక శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ గవర్నర్ పరిశీలించారు. జిల్లాలోని జాఫర్ బావి, ఖమ్మం ఖిల్లా, లకారం లేక్ సస్పెన్షన్ బ్రిడ్జి, వైరా లేక్, పాలేరు రిజర్వాయర్, బోటింగ్,నేలకొండపల్లి లోని బుద్ధ స్తూపం, జమలాపురం వేంకటేశ్వర స్వామి టెంపుల్, కూసుమంచి శివాలయం, కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ తదితర పర్యాటక ప్రదేశాల వివరాలను కలెక్టర్ వివరించారు.
వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్ లో పంట రుణమాఫీ, డ్రం సీడర్ పద్ధతిలో వరి సాగు, సేంద్రీయ వ్యవసాయం, హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ మిల్లెట్స్, ఆయిల్ పామ్ మొక్కల పెంపకం, రైతులకు కలిగే ప్రయోజనాలు తెలుపుతూ ప్రదర్శించిన వాటిని గవర్నర్ పరిశీలించి అభినందించారు.
గాంధీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వొకేషనల్ ట్రైనింగ్ శిక్షకులు, విద్యార్థినిలు తయారు చేసిన చేతి వృత్తులను, ఇందిరా మహిళా శక్తి వారి చాగంటి లావణ్య మిల్లెట్ స్నాక్స్, సంచార విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ప్రదర్శనను గవర్నర్ పరిశీలించారు.
అనంతరం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి జిల్లా అధికారులు, ప్రముఖులు, కళాకారులు రచయితలు, క్రీడాకారులతో ముఖాముఖి నిర్వహించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకాంక్షించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య లాగే తాను పర్యావరణ వేత్తగా తన కెరియర్ ను ప్రారంభించానని, ప్రకృతి దైవంతో సమానమనే భావన మన అందరిలో ఉండాలని, ధర్మో రక్షితః రక్షితః నినాదం ప్రకారం పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని అన్నారు.
ఖమ్మం జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేయడం చాలా బాగుందని, కొత్తగూడెం జిల్లాలో పాఠశాలల్లో మెడిసినల్ మొక్కలు పెంచుతున్నారని, ఖమ్మం జిల్లాలోను ఇది అమలు చేయాలని గవర్నర్ సూచించారు. జిల్లాలోని ప్రతి ఇంటిలో మొక్కలు పెంచాలని, చెట్లు మన జీవనానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉందని, సార్ నాథ్ లాగా బౌద్ద స్థూపం అభివృద్ధి కావాలని, అనేక మంది పర్యాటకులు జిల్లాకు రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ టూర్ చాలా బాగున్నాయని, క్షేత్రస్థాయి పర్యటనలతో పిల్లలు పాఠ్య పుస్తకాల కంటే మెరుగ్గా నేర్చుకుంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల ఎడ్యుకేషన్ టూర్ నిర్వహించాలని గవర్నర్ సూచించారు.
డబ్బుతో మాత్రమే అభివృద్ధి సాధ్యం కాదని, సమయం, మంచి విజన్, చిత్తశుద్ధి అవసరమని అన్నారు. ఖమ్మం జిల్లాలో అనేక పురావస్తు శాఖ ప్రదేశాలు, దేవాలయాలు, స్టెప్ వెల్స్ ఉన్నాయని అన్నారు. ప్రకృతి నుండి వచ్చే భారీ వర్షాలు, విపత్తులను మనం ఎవరం ఆపలేమని, విపత్తుల సమయంలో ప్రాణ నష్టం తక్కువగా జరిగే విధంగా, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు చేపట్టిన పునరావాస చర్యలు, ప్రజలకు పరిహారం సకాలంలో అందజేసి ఆదుకున్న విధానం అభినందనీయమని గవర్నర్ కొనియాడారు.
వరదలు వంటి విపత్తు సమయాలలో ప్రజలు ఆధార్ కార్డు, పాన్ కార్డు, చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు కోల్పోతారని, వాటిని ప్రజలకు త్వరగా అందించేందుకు ప్రత్యేకంగా క్యాంప్ లు నిర్వహించడం పట్ల కలెక్టర్ ను గవర్నర్ అభినందించారు. ఖమ్మం జిల్లాను దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చే లక్ష్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, రచయితలు, కళాకారులు భాగస్వాములు కావాలని అన్నారు. విద్య, వైద్య రంగాలలో జిల్లా మెరుగైన స్థానంలో ఉందని అన్నారు. జిల్లాలో మరోసారి పర్యటించినప్పుడు ప్రముఖులతో పర్యాటక ప్రాంతాలను పరిశీలిస్తానని గవర్నర్ తెలిపారు.