రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్న తెలంగాణా స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) కానిస్టేబుళ్లపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఉపప్రకమించింది. ఇందులో భాగంగానే 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెండయిన కానిస్టేబుళ్లలో బెటాలియన్ల వారీగా మూడు, నాలుగు, ఐదులకు చెందిన ఆరుగురు చొప్పున, ఆరులో ఐదుగురు, పన్నెండులో ఐదుగురు, 13లో ఐదుగురు, 17వ బెటాలియన్ లో ఆరుగురు చొప్పున ఉన్నారు.
క్రమశిక్షణ కలిగిన శాఖలో విధులు నిర్వహిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించడం వల్లే ఈ చర్య తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ముఖ్యంగా రోడ్లపై ధర్నాలు, సెక్రటేరియట్ ముట్టడి, బెటాలియన్ల ముందు ఆందోళనలకు దిగడం వంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు చెబుతున్నారు. సెలవుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వును ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు స్వయంగా డీజీపీ వెల్లడించినా, ఆందోళనలు కొనసాగించడాన్ని ఉన్నతాధికరులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయా ఆందోళనలకు కారకులైనవారిని, రెచ్చగొట్టినవారిని గుర్తించి సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. కాగా టీజీఎస్పీ కానిస్టేబుళ్ల ఆందోళన వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నట్లు కూడా పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఇదే అంశాన్ని డీజీపీ జితేందర్ స్వయంగా వెల్లడించడం గమనార్హం.