తెలంగాణాలో అదనపు కలెక్టర్లుగా పనిచేస్తున్న అధికారులకు ప్రభుత్వం కొత్త కార్లను సమకూర్చింది. ఆర్టీఏ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తున్న కియా కార్నివాల్ కార్లను అదనపు కలెక్టర్ల ప్రయాణ సదుపాయం కోసం సమకూర్చనుంది. ఈమేరకు 32 కొత్త కియా కార్నివాల్ కార్లు ప్రగతి భవన్ కు చేరుకున్నాయి. అదనపు కలెక్టర్లతో, జిల్లా పంచాయతీ అధికారులతో సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.
పల్లె, పట్టణ ప్రగతి పురోగతి, అధికారుల పనితీరు, నిధుల వినియోగం, భవిష్యత్ కార్యాచరణపై సీఎం అధికారులతో చర్చిస్తున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, ఇంకా చేపట్టాల్సిన పనులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల ఖర్చు, హరితహారం, స్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం తదితర అంశాలపై సీఎం సమీక్షించి, పెండింగ్ పనుల పూర్తికి మార్గదర్శనం చేయనున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చేతుల మీదుగా కియా కార్నివాల్ కార్లను అదనపు కలెక్టర్లకు అందజేయనున్నారు.