కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కఠినంగా అమలు చేస్తున్న ‘లాక్ డౌన్’పై తెలంగాణా ప్రభుత్వం పునరాలోచచన చేస్తున్నదా? ప్రస్తుత లాక్ డౌన్ గడువు తర్వాత సీఎం కేసీఆర్ ప్రజాజీవనానికి, వారి ఉపాధి అవకాశాలకు అనుకూల నిర్ణయం తీసుకోబోతున్నారా? లాక్ డౌన్ కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందా? ఔననే అంటున్నాయి అధికార వర్గాలు.
ఈ అంశంలో తెలంగాణా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో మే 7వ వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్న కారణంగా పేదలు, సామాన్యులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పేదల ఉపాధి రోజురోజుకూ కొడిగడుతున్నట్లు ప్రభుత్వం విశ్లేషించిందంటున్నారు.
ఈ నేపథ్యంలో మే 7వ తేదీ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో భారీగా సడలింపులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కరోనా పాజిటివ్ కేసులు లేని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలుపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని, గ్రామీణ ప్రాంతాల్లో పనులు సజావుగా సాగే విధంగా లాక్ డౌన్ ను సడలించవచ్చంటున్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం లాక్ డౌన్ ను కొనసాగించే దిశగానే ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడవచ్చని సమాచారం.