పీఆర్వోల విషయంలో తెలంగాణాకు చెందిన పలువురు మంత్రులు అలర్టయ్యారు. ప్రస్తుతం తమ వద్ద గల పీఆర్వోల కదలికలు, వ్యవహార తీరుపై డేగకన్ను వేసినట్లు తెలుస్తోంది. పీఆర్వోలు ఎవరెవరితో లింకులు కలిగి ఉన్నారు? ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో వారికి గల పూర్వ సంబంధాలేమిటి? వంటి తదితర అంశాలపై ప్రభుత్వ పెద్దలు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పెద్దల నుంచి కూడా పలువురు మంత్రులకు అంతర్గతంగా ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. సీఎం పీఆర్వో గటిక విజయ్ కుమార్ రాజీనామా అంశం వివాదాస్పదం కావడం, భిన్న కథనాలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో పీఆర్వోల వ్వవస్థపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించినట్లు వార్తలు అందుతున్నాయి.
వాస్తవానికి తెలంగాణాలోని అనేక మంది మంత్రుల వద్ద అనధికార పీఆర్వోలే ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రుల వద్ద పీఏలు, పీఎస్ లు మాత్రమే ఉండేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రుల వద్ద ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీఏలు, పీఎస్ లు ఉన్నప్పటికీ, కొందరు పీఆర్వోలు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో అధికారికంగా, అదనపు పీఆర్వోలు అనధికారికంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సీఎం పీఆర్వో వ్యవస్థ అధికారికం కాగా, మినిస్టర్ల వద్ద కొనసాగుతున్న పీఆర్వోల్లో అనేక మంది అనధికారికంగా చెబుతున్నారు. అయితే పలువురు మంత్రుల వద్ద గల అనేక మంది పీఆర్వోలు ఇప్పటికే వివాదాస్పదమై ఈ అనధికార కొలువుల నుంచి తొలగించబడ్డారు. ఉత్తర తెలంగాణాకు చెందిన ఓ మంత్రి వద్ద ఏడాది క్రితం గల పీఆర్వో ఒకరు ఉద్యోగాలు ఇప్పిస్తానని, పైరవీలు చేస్తానని చెబుతూ వసూళ్లకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది. విషయం తన చెవిన పడడంతో ఏడాది క్రితమే ఆ పీఆర్వోను తొలగించి మరొకరిని మంత్రి నియమించుకున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పీఆర్వోలుగా కొనసాగుతున్నవారిలో 90 శాతం జర్నలిస్టులే ఉండడం విశేషం. మంత్రుల కార్యక్రమాలకు సంబంధించిన వార్తల కవరేజీ విషయంలో, రాయడంలో నేర్పరులనే నమ్మకంతో అనేక మంది మంత్రులు జర్నలిస్టులనే పీఆర్వోలుగా ఎంచుకున్నారు. మరికొందరు జర్నలిస్టులు పైరవీలు చేసి మరీ మంత్రుల వద్ద పీఆర్వోలుగా చేరినట్లు ప్రచారం ఉంది. గమనించాల్సిన అంశమేమిటంటే మంత్రులకే కాదు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేల వద్ద కూడా అధికార, అనధికార పీఆర్వోల వ్యవస్థ కొనసాగుతోంది. తమకు నచ్చిన జర్నలిస్టులను గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పీఆర్వోలుగా ఎంచుకుంటున్నప్పటికీ, తదనంతర పరిణామాల్లో సమస్యగా మారుతున్న దాఖలాలు అనేకం. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ఎంతో ఇష్టపడి పీఆర్వోగా నియమించుకున్న జర్నలిస్టుపై ఆర్థికపరమైన ఆరోపణలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల వ్యవహారంలో ఈ బాగోతం వెల్లడైన అనంతరం ఎమ్మెల్యే తన పీఆర్వోను తొలగించారనేది వేరే విషయం.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంత్రుల వద్ద గల పీఆర్వోల సంగతి ఎలా ఉన్నప్పటికీ, పలువురు మంత్రులతో సన్నిహితంగా ఉన్నట్లు తమ కదలికల ద్వారా బహిర్గతమవుతున్న కొందరు మీడియా ప్రతినిధులు కూడా సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పొరుగున గల ఆంధప్రదేశ్ రాష్ట్రం సరిహద్దుల్లో గల ఓ జిల్లాకు చెందిన మంత్రి పేరు చెప్పుకుని ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి పెద్ద ఎత్తున సెటిల్మెంట్ దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఆఫీసునే తెరిచినట్లు ప్రచారం ఉంది. మంత్రికి తానే సలహాదారుగా బాహాటంగానే సదరు జర్నలిస్టు చెప్పుకుంటూ, చేస్తున్నట్లు ప్రచారంలో గల నిర్వాకాలపై భారీ ఆర్థిక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ప్రభుత్వానికి చేరినట్లు తెలుస్తోంది.
మొత్తంగా సీఎం పీఆర్వో పదవి నుంచి గటిక విజయ్ కుమార్ రాజీనామా ఘటన అనంతరం మంత్రుల వద్ద గల పీఆర్వోల, వారికి సన్నిహితంగా ఉన్నట్లు చెప్పుకునే కొందరు జర్నలిస్టుల వ్యవహారాలపై ప్రభుత్వం నిఘాను పెంచింది. వివిధ శాఖల ద్వారా అవసరమైన సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు వార్తలు అందుతున్నాయి. తమ వద్ద గల వివాదాస్పద పీఆర్వోల, సన్నిహితులుగా ప్రచారం చేసుకునే జర్నలిస్టుల విషయంలో మంత్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు జారీ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటువంటి వారివల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే మంత్రులే పూర్తి బాధ్యత వహించాలని కూడా ప్రభుత్వ పెద్దల నుంచి హెచ్చరికలు జారీ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.