ఖావో.., పీవో.., మస్త్ మజా కరో భాయ్… ఈరోజు అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు బేఫికర్. డిసెంబర్ 31 సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం మందు బాబులకు కల్పించిన ‘మద్యం’ లాంటి అవకాశమిది. పీకలదాకా మందేసి, ఆ తర్వాత చిందేసేందుకు ప్రస్తుత వేళలకు అదనపు సమయాన్ని ఇస్తూ ప్రభుత్వం ఫ్రెష్ గా అంటే..మంగళవారం ఉత్తర్వు కూడా జారీ చేసింది.

తెలంగాణా సర్కార్ జారీ చేసిన ఉత్తర్వు ఇదే

సాధారణంగా ఇప్పటి వరకు బార్లకు రాత్రి 12 గంటల వరకు, రిటెయిల్ వైన్ షాపులకు 10 గంటల వరకు ప్రభుత్వం తరపున ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ డిసెంబర్ 31 సందర్భంగా, కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణాలోని బార్లకు, వైన్ షాపులకే కాదు ఇంకా అనేక రంగాల్లోని మద్యం విక్రేతలు భారీగానే సొమ్ము చేసుకునేందుకు అదనపు సమయాన్ని కేటాయిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. 2బీ (బార్లు) సీ1 (ఇన్-హౌజ్), ఈపీ1 లైసెన్సెస్ (ఈవెంట్ పర్మిట్), టీడీ1 (ఇన్-హౌజ్) లైసెన్స్ కలిగిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థల ద్వారా మద్యం సరఫరా చేసేందుకు రాత్రి 1.00 గంట వరకు పర్మిషన్ ఇచ్చారు. అదే విధంగా ఏ4 లైసెన్సు (రిటెయిల్) గల వైన్ షాపుల్లో మద్యం విక్రయించే సమయాన్ని అర్థరాత్రి 12 గంటల వరకు పొడిగించారు. ఈమేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేష్ కుమార్ Memo no. 24807/Ex. II (1)/2019-1  ద్వారా ఉత్తర్వు జారీ చేశారు.

మందుబాబులూ గెట్ రెడీ…మన కేసీఆర్ సర్కార్ కల్పించిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీదే. అన్నట్లు అర్థరాత్రి వరకు తాగి, తందనాలాడిన వారిని తీసుకువెళ్లేందుకు రాజధాని నగరంలో మెట్రో సర్వీసుల సమయాన్ని కూడా పొడిగించినట్లున్నారు. కాకపోతే ప్రతి క్వార్టర్ పై ఈ మధ్యనే ఓ రూ. 20 పెంచారు. అంతే..!

Comments are closed.

Exit mobile version