ప్రశ్నార్థకమే? ఉద్యోగుల వయో పరిమితి పెంపు! – 2
తెలంగాణాలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు అంశంలో ఇది మరో కోణం. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచితే సర్కారుకు కలిగే లాభాలు, ఆర్థిక వెసులుబాటు గురించి ఇంతకు ముందు కథనంలో చదివారు కదా? అందువల్ల రిటైర్మెంట్ వయస్సు పెంపునకే సర్కారు ముందడుగు వేస్తుందా? ఇదే జరిగితే ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మాటేమిటి? ఇవీ జవాబు లభించాల్సిన ప్రశ్నలే.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచితే నిరుద్యోగ యువత, విద్యార్థులు భారీ ఎత్తున ఉద్యమించే అవకాశం లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే పెద్ద ఎత్తున ఆందోళనలు పుట్టుకురావచ్చంటున్నారు. ఈ అంశంలో ఓయూ నిరుద్యోగ విద్యార్థులు హెచ్చరికలు కూడా జారీ చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నిస్తేజపు తీరుపైనా చర్చ జరుగుతోంది. గత మార్చి నెల నుంచి రిటైరైన ఉద్యోగులకు ఇప్పటి వరకు అనేక రకాల చెల్లింపులు ప్రభుత్వ పరంగా ఏ మాత్రం జరగలేదంటున్నారు. టీఎస్ జీఎల్ఐ కి సంబంధించి ఒక్కో ఉద్యోగికి లక్షల రూపాయల చెల్లింపులు చేయాల్సి ఉందంటున్నారు. గ్రూపు ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, కమిటేషన్ చెల్లింపులకు సంబంధించి పేమెంట్లు జరగలేదని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసంగా రూ. 5 కోట్ల చొప్పున, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 50 కోట్ల వరకు జీపీఎఫ్ మొత్తాల చెల్లింపులు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు.
సాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించి సర్వీసును ప్రభుత్వాలు పొడిగిస్తుంటాయి. కానీ ఇటీవల ఎల్డీసీ, యూడీసీ స్థాయి ఉద్యోగులకు కూడా సర్వీసును పొడిగించడాన్ని ఉద్యోగ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సర్వీసు పొడిగింపులో ఇది సరికొత్త ఆనవాయితీగా ఆ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు నోరు మెదపడం లేదని వ్యాఖ్యానిస్తున్నాయి.
తాజాగా ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన అంశంపైనా సంఘాలు ప్రశ్నించలేదని గుర్తు చేస్తున్నారు. అయితే జూన్ నెలకు సంబంధించి పూర్తి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. పాలక వర్గ నేతలను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఉదంతంపై ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శనాత్మక పోస్టింగులు చక్కర్లు కొడుతున్నాయి.
ఆయా అంశాలను లోతుగా పరిశీలించినపుడు జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని నిస్తేజ స్థితిలో ఉద్యోగ సంఘాలు ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందువల్ల ప్రస్తుత ఉద్యోగ సంఘాల శక్తి, యుక్తుల తీరుతెన్నులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వ్యవహరిస్తుందని అంటున్నారు. దరిమిలా ఉద్యోగుల వయో పరిమితిని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి నుంచి రిటైరైన ఉద్యోగులకు రావలసిన చెల్లింపులు పెండింగులో ఉండడాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు.