కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నదా? కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర, అత్యన్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు పలువురు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు ఇప్పటికే ప్రగతి భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇండోనేషియాకు చెందిన కొందరు విదేశీయులకు కరోనా పాజిటివ్ నివేదికల నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు తెలంగాణా సచివాలయంలో విజిటర్స్ ను అనుమతించడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సందర్శకులకు అనుమతి లేదంటూ బీఆర్కే భవన్ వద్ద నోటీసు కూడా అంటించారు.
రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సమావేశంలో కూలంకషంగా చర్చించిన అనంతరం ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నిర్దేశిత అత్యవసర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులకు, సిబ్బందికి ‘వర్క్ ఫ్రం హోం’ ఆదేశాలు వెలువడే ఛాన్స్ ఉందంటున్నారు. మిగతా ప్రభుత్వ శాఖలకు నిర్ణీత వ్యవధి వరకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. అనేక ప్రయివేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోం) చేయాల్సిందిగా ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అదేవిధంగా ఏడు, పదో తరగతి మినహా మిగతా తరగతుల విద్యార్థుల పరీక్షలను రద్దు చేసి, పై తరగతులకు వారిని ప్రమోట్ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని విద్యాశాఖ వర్గాలు ప్రభుత్వ పెద్దలకు నివేదించన్నట్లు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి, విద్యార్థుల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకుంటే బావుంటుందని సూచన చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తెలంగాణా ప్రభుత్వం వడివడిగా వేస్తున్న అడుగులు, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో అప్రమత్తతను కూడా గుర్తు చేస్తున్నాయి.