ఆంధప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టులపై తెలంగాణా ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ బోర్డు చైర్మెన్ కు లేఖ రాశారు. అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయని ఆరోపించింది. కృష్ణా బోర్డు వాటిని అడ్డుకోలేకపోయిందని ప్రభుత్వం పేర్కొంది.
అంతేగాక డీపీఆర్ కోసం సన్నాహకాలుగా చెబుతూ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్నారని ఆరోపించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా అక్కడకు పంపలేకపోయిందని పేర్కొంది. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే ఆపాలని రజత్ కుమార్ తన లేఖలో కోరారు. కాగా ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో ఏపీ వైఖరిని తీవ్రంగా నిరసించిన సంగతి తెలిసిందే. ఏపీ చర్యలతో తెలంగాణలో కృష్ణా బేసిన్ లో ఉన్న కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలంగాణ కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. రజత్ కుమార్ రాసిన లేఖలోని ‘విషయ’ ప్రతిని దిగువన చూడవచ్చు.