అనుమతి లేని లే ఔట్లు, ఖాళీ ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ఇటీవల జారీ చేసిన మెమోపై తెలంగాణా ప్రభుత్వం గురువారం స్పష్టతనిచ్చింది. ఈ విషయంలో కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలు వాస్తవానికి అనుగుణంగా లేవని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీన జారీ చేసిన మెమో నెం. 1730/P3/2021 ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో వార్డులవారీగా వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్ర పరిశీలన, గ్రామం, వార్డు, సర్వే నెంబర్, కాలనీలవారీగా క్లస్టర్లుగా విభజించాలని ఆదేశించినట్లు చెప్పారు. అయితే కొన్ని పత్రికల్లో ఇందుకు విరుద్ధంగా పదిహేను రోజుల్లో పెండింగ్ లో గల అన్ని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలిస్తారనే సారాంశంతో వచ్చిన కథనం సరైంది కాదన్నారు.
ఎల్ఆర్ఎస్ 2020 కింద వచ్చిన దరఖాస్తులను క్లస్టర్లవారీగా ఉన్న లే ఔట్ల వారీగా విభజించడం, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, వచ్చిన దరఖాస్తుల్లో నిబంధనలకు లోబడి ఎన్ని లే ఔట్లు క్రమబద్ధీకరించడానికి అనువుగా ఉన్నాయనే అంతర్గత సమాచారాన్ని క్రోఢీకరించుకోవడానికి మాత్రమే జారీ చేసిన మెమో అసలు ఉద్దేశంగా వివరించారు. క్రమబద్ధీకరించడానికి వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నిశితంగా పరిశీలించడానికి మాత్రమే ఈ మెమోను జారీ చేశామే తప్ప, అర్హమైనవాటిని తక్షణం ఆమోదించడానికి కాదన్నారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వ్యవహారం ప్రస్తుతం న్యాయపరిశీలనలో ఉందని, అందువల్ల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఆమోద ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలు కోర్టు ఆదేశానికి అనుగుణంగా మాత్రమే తీసుకుంటామని ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టం చేశారు.