కరోనా పరిస్థితుల్లో పేదలకు, వలస కూలీలకు చేతనైతే సహాయం చేద్దాం.. కాకపోతే సహాయం చేసేవారిని చూసి చప్పట్లు కొడదాం’ అంటూ తెలంగాణా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేనే నియోజకవర్గానికి సుప్రీంగా అభివర్ణిస్తూ, ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఎవరైనా సరే… చివరికి మంత్రి అయినా నియోజకవర్గంలో అడుగిడవద్దనే సారాంశంతో రాజయ్య టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రాజయ్య వ్యాఖ్యలకు శ్రీహరి కౌంటర్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో చిట్ల స్వరూప ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ శ్రీహరి చేతుల మీదుగా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి చేసిన వ్యాఖ్యలు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మరోసారి రాజకీయంగా చర్చకు దారి తీశాయి. అయితే నిన్న రాజయ్య, నేడు శ్రీహరి… నేరుగా పేర్లు ప్రస్తావించుకోకుండానే నర్మగర్భంగా పరస్పరం వ్యాఖ్యలు చేసుకోవడమే అసలు విశేషం.
ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఎవరూ నియోజకవర్గంలో అడుగిడవద్దని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోనే పర్యటించి తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా శ్రీహరి చేసిన కౌంటర్ వ్యాఖ్యలను దిగువన గల వీడియోలో వినవచ్చు.