ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముంజేతి కడియం మాయమైంది. అభిమానుల సెల్ఫీ ఫొటోల సమయంలో ఎవరో తమ హస్త లాఘవాన్ని ప్రదర్శించారు. ఈ బంగారు కడియం మంత్రిగారి సెంటిమెంట్ గా ఆయన అనుచరులు చెప్పే మాట. దీంతో అక్కడే గల పోలీసులను, అంగరక్షకులను తిట్టిపోశారు. ‘ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ కడియం కావలసిందే’ అని హుకుం జారీ చేశారు. ఇదీ శుక్రవారం ప్రచురితమైన వార్తా కథనంలోని సారాంశం. ఓకే… హుకుం జారీ చేశాక, తిట్టిపోశాక ‘కడియం’ ఆచూకీ కనిపెట్టడంలో కష్టపడితే పోలీసులు సఫలం కావచ్చు. ఎందుకంటే అది మంత్రిగారి కడియం, మామూలు విషయమేమీ కాదు మరి. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ కడియం కావలసిందేనని ఆదేశించాక ఏదో విధంగా పోలీసులు మంత్రి కడియాన్ని తిరిగి ఆయనకు అప్పగించవచ్చు. ఇటువంటి చోరీ కేసుల్లో దర్యాప్తు, రికవరీ పోలీసుల బాధ్యత కూడా.
కానీ ఈ సందర్భంగా చోరీ సొత్తు రికవరీకి సంబంధించి ఓ పాత ‘కత’ను చెప్పుకోక తప్పదు. ఆ తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ బంగారు కడియం గురించి క్లైమాక్స్ చెప్పుకుందాం. ఇంతకీ అసలు ‘కత’ ఏమిటంటే 1998లో ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లి బంగారు కిరీటం సహా ఇతర ఆభరణాలు మాయమైన సంగతి తెలిసిందే. అంటే… చోరీ జరిగిందన్నమాట. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రకాష్ సాహు అనే గజదొంగ అమ్మవారి నగలు తస్కరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పట్లో ప్రకాష్ సాహు నుంచి దుర్గమ్మతల్లి బంగారు కిరీటం, ఇతర నగలను రికవరీ చేయడంలో పోలీసులు నానా కష్టాలు, పాట్లు పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. సరే పోలీసులు వాళ్ల తిప్పలేవో వాళ్లు పడ్డారు. మొత్తానికి బంగారు కిరీటాన్ని, ఇతర నగలను ప్రకాష్ సాహు నుంచి రికవరీ చేసి అమ్మవారి ఆలయ అధికారులకు అప్పగించారు కూడా.
అయితే ప్రకాష్ సాహు నుంచి రికవరీ చేసి దుర్గమ్మ తల్లికి అలంకరించిన బంగారు కిరీటాన్ని చూసి, వాటిని తయారు చేసిన అసలు స్వర్ణకార శిల్పి అవాక్కయినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ‘అబ్బే.. నేను తయారు చేసిన కిరీటం ఇది కాదు’ అని అమ్మవారి కిరీటాన్ని తయారు చేసిన అసలు స్వర్ణకార శిల్పి తేల్చేయడంతో పోలీసులతోపాటు ఆలయ అధికారులు సైతం కంగు తిన్నట్లు అప్పట్లో రకరకాల కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి అనేక వార్తా కథనాలు వెలువడ్డాయి కూడా. ఈ ఘటనలో చోరీ సొత్తు రికవరీకి సంబంధించి పోలీసులపై తీవ్ర ఒత్తిడి వల్లే ఇలా జరిగిందనే ప్రచారం కూడా జరిగింది.
ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముంజేతి కడియం విషయంలోకి వద్దాం. ఈనాడు ప్రచురించిన వార్తా కథనం ప్రకారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కడియానికి సంబంధించి ‘ఏం చేస్తారో నాకు తెలియదు… ఆ కడియం కావలసిందే’ అని హుకుం జారీ అయింది. ‘బాబ్బాబూ ఎవరైనా తీసుకుంటే ఇచ్చేయండి. మిమ్మల్ని ఏమీ అనం’ అని కార్యకర్తలను పోలీసులు బతిలాడుతున్నారట.
పోలీసులు ఇలా బతిలాడితే మాత్రం ‘చోర’ శిఖామణి ఎవరోగాని వెంటనే కరిగిపోయి కడియాన్ని తిరిగి ఇచ్చేయడు కదా? అందునా అదేమీ సాదా సీదా వాచో, మరే ఇతర వెండి, రాగి వస్తువో కూడా కాదాయే. బంగారం… స్వచ్ఛమైన మేలిమి బంగారంతో తయారు చేయించిన కడియం. ఇటువంటి బంగారు కడియాన్ని ఎంతో హస్తలాఘవంతో చేజిక్కించుకున్న సదరు కార్యకర్త తిరిగి ఇస్తారని నమ్మతూ పోలీసులు బతిలాడడం కూడా విశేషంగానే చెప్పుకోవాలి. మరేం చేయాలి..? దొంగంటూ దొరికితే పోలీసు మర్యాదు చేస్తారనేది వేరే విషయం… లేదంటే వారిపై ఒత్తిడి పెరిగితే… అదిగో అప్పట్లో వచ్చిన వార్తల ప్రకారం దుర్గమ్మ తల్లి బంగారు కిరీటం తరహాలోనే మంత్రిగారి కడియాన్ని కూడా పోలీసులు కష్టపడి కనిపెట్టాల్సి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది.
సరే.. తన బంగారు కడియం చోరీకి సంబంధించి మంత్రి లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తే, కడియం తస్కరించిన దొంగ దొరకొచ్చు… కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చు. లేదంటే ఒత్తిడిని తీవ్రతరం చేస్తే సీసీఎస్ పోలీసులో, మరే ఇతర ప్రత్యేక దర్యాప్తు పోలీసులో నానా పాట్లు పడి కడియాన్ని ఎలాగోలా రికవరీ చేసినా అసలు ప్రయోజనం ఉంటుందా? అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఆ కడియం అసలే మంత్రిగారికి సెంటిమెంట్ అట. అందువల్ల చోరీకి గురైన అదే కడియం లభిస్తే తప్ప మంత్రిగారి సెంటిమెంట్ నిలిచే అవకాశం లేదన్నదే ఇక్కడ అసలు సమస్య. ఈలోపు కడియాన్ని తస్కరించిన దొంగ దాన్ని అలాగే దాచిపెట్టాలని, ఎవరికీ అమ్ముకోవద్దని, కొన్నవాళ్లు సైతం కడియాన్ని కరిగించి దాని ఆనవాళ్లు లేకుండా చేయరాదనే కోరుకుందాం. ఎందుకంటే అది మంత్రిగారి సెంటిమెంట్ కడియం. అందుకే ‘శీఘ్రమేవ ఎక్సైజ్ మంత్రిగారి బంగారు కడియం రికవరీ ప్రాప్తిరస్తు’.