తెలంగాణాలోని ప్రస్తుత పరిస్థితులను దెబ్బతీస్తే సహించేది లేదని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడరాదని కూడా రాష్ట్ర పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఎంతటివారైనప్పటికీ కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్ ను ఈ ఉదయం ఆదేశించారు. ఈ అంశంలో మధ్యాహ్నం పోలీసు యంత్రాంగంతో సమీక్షించాలని కూడా సీఎం నిర్దేశించారు.
ఈ నేపథ్యంలోనే డీజీపీ జితేందర్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో సమావేశమయ్యారు. ఇటీవలి, తాజా పరిణామాల నేపథ్యంలో చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ పేర్కొన్నారు. పీఏసీ చైర్మెన్ అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ కు చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల మధ్య ఏర్పడిన వివాదం, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల్లో డీజీపీ పోలీస్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.