వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం మద్దెలగూడెం వద్ద పోలీసులతో జరిగిన ఓ ఎన్కౌంటర్ ఘటనలో అప్పటి పీపుల్స్ వార్ ప్రొవెన్షియల్ కమిటీ కార్యదర్శి పులి అంజయ్య, అతని భార్య శోభక్క మృతి చెందారు. 1990వ దశకంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ ఉదంతం రాష్ట్రంలోనేకాదు దేశవ్యాప్తంగానూ సంచలనం కలిగించింది.
అదేవిధంగా 1999లో మల్హర్ మండలం కొయ్యూరు ఎన్కౌంటర్లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఉత్తర తెలంగాణా కార్యదర్శి శీలం నరేష్, మరో అగ్రనేత ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిలు మరణించారు. ఈ ఘటన సైతం విప్లవోద్యమ చరిత్రలో పెద్ద సంచలనమే. అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీ ఉద్యమ నేపథ్యంలోనే ఇది అతిపెద్ద ఎన్కౌంటర్ ఉదంతంగా అభివర్ణిస్తుంటారు.
ఈ రెండు సంఘటనల్లోనూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర డీజీపీలుగా వ్యవహరించిన అధికారులు నేరుగా స్పందించడంగాని, ఘటనా ప్రదేశాల్లో పర్యటించిన దాఖలాలుగాని లేవు. అనంతర పరిణామాల్లో దాదాపు దశాబ్ధ కాలం నుంచి ఉమ్మడి రాష్ట్రంలోనేకాదు, గడచిన ఆరేళ్లుగా ప్రత్యేక తెలంగాణాలోనూ నక్సల్ కార్యకలాపాలు లేవన్నది పోలీసులు చెబుతున్న మాటే.
పులి అంజయ్య, నల్లా ఆదిరెడ్డి వంటి అగ్రనేతలు ఎన్కౌంటర్ లో మరణించిన భారీ నష్టపు ఘటనల అనంతర పరిణామాల్లో మిగతా నక్సలైట్లు పొరుగన గల ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోకి ‘షెల్టర్’కోసం వెళ్లిపోయారు. ప్రస్తుతం మళ్లీ తెలంగాణాలో పట్టు సాధించేందుకు మావోయిస్టు పార్టీ తన ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని తన కార్యకలాపాలను తిరిగి కొనసాగిచేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోందనే విషయాన్ని పోలీసులు పసిగట్టారు.
ఈ నేపథ్యంలోనే అటు కుమ్రం భీం, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అడవుల్లో వారం క్రితం వేర్వేరుగా జరిగిన ఎన్కౌంటర్ ఘటనలు తెలంగాణాలో సంచలనం కలిగించాయి. తెలంగాణాలో మళ్లీ వేళ్లూనుకునేందుకు ప్రయత్నిస్తున్న మావోయిస్టు పార్టీ నక్సల్స్ అంశంలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా అటవీ ప్రాంతాల్లో పర్యటించడం సహజంగానే చర్చకు దారి తీసింది. కొమ్రం భీం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి నేరుగా పర్యటించి నక్సల్స్ కట్టడికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులకు దిశా, నిర్దేశం చేశారు. మావోయిస్టు నక్సల్స్ మళ్లీ తెలంగాణాలో ప్రవేశించేందుకు చేస్తున్న యత్నాలను తిప్పికొడతామని, వారి ఆటు సాగనివ్వబోమని కూడా డీజీపీ ఈ సందర్భంగా స్ఫష్టం చేశారు.
ఒకప్పుడు రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుల కదలికలు, ఎన్కౌంటర్ వంటి ఘటనల సందర్భంగానూ డీజీపీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భాలు అత్యంత అరుదు. కానీ తాజాగా నక్సల్ కదలికల జాడ మాత్రమే ఉన్న పరిస్థితుల్లో డీజీపీ స్థాయి అధికారి నేరుగా అటవీ ప్రాంతాల్లో పర్యటించడం గమనార్హం. ఇంతకీ డీజీపీ మహేందర్ రెడ్డి నేరుగా ఎందుకు రంగంలోకి దిగారు? ఇదీ అసలు ప్రశ్న.
నక్సల్ కార్యకలాపాల అణచివేతలో ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డికి పూర్తి స్థాయి పట్టు ఉండడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో పీపుల్స్ వార్ నక్సల్ కార్యకలాపాలు ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో ఆయన అటవీ ప్రాంత జిల్లాల్లోనే విధులు నిర్వహించడం గమనార్హం. గోదావరిఖని ఏఎస్పీగా, బెల్లంపల్లి అదనపు ఎస్పీగా, నిజామాబాద్ ఎస్పీగా మహేందర్ రెడ్డి విధులు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎస్పీగా మహేందర్ రెడ్డి విధులు నిర్వహించిన సందర్భంలో అనేక సంచలనాత్మక ఎన్కౌంటర్ ఘటనలు చోటు చేసుకున్నాయి.
పోలీసు వర్గాల కథనం ప్రకారం… తీవ్రవాద కార్యకలాపాల అణచివేత అంశంలో డీజీపీ మహేందర్ రెడ్డికి మంచి పట్టు ఉంది. దశాబ్ధకాలంగా తెలంగాణా పోలీసులు నక్సల్స్ తో నేరుగా తలపడిన సందర్భాలు అత్యంత అరుదు. కానీ దశాబ్ధాల క్రితం నాటి పరిణామాలు మళ్లీ పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వహించే స్థానిక పోలీసుల గుండెనిండా ‘ఆత్మస్థయిర్యం’ నింపే దిశగా డీజీపీ ‘ఫీల్డ్ విజిట్’ చేస్తున్నారు.
ప్రస్తుతం వివిధ జిల్లాలకు ఎస్పీలుగా వ్యవహరిస్తున్న అనేక మంది ఉన్నతాధికారులు, దిగువస్థాయి అధికారులు, సిబ్బంది కూడా యువకులే. నక్సల్స్ తో పోరాటం చేయాల్సి వస్తే తమకు ‘పెద్ద దిక్కు’ ఉన్నారనే విశ్వసాన్ని వారిలో కలిగించేందుకే డీజీపీ మహేందర్ రెడ్డి క్షేత్ర స్థాయి పర్యటనను ఎంచుకున్నారని ఓ రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారి నిర్వచించారు. అంతేగాక నక్సల్స్ తో తలపడే పరిస్థితి ఉత్పన్నమైతే, క్షేత్రస్థాయిలో పోలీసులకు గల సౌకర్యాలేమిటి? ఆయుధ సంపత్తి ఏమిటి? వాహనాల కండిషన్ ఎలా ఉంది? వంటి అనేక అంశాలను కూడా ఆయన నేరుగా సమీక్షించి ఉంటారని చెప్పారు.
ఇదే దశలో అసలు తెలంగాణాలో మళ్లీ నక్సల్స్ బలపడేందుకు గల అవకాశాలేమిటి? స్థానిక యువత వారివైపు మొగ్గు చూపే పరిస్థితులు ఏవేని ఉన్నాయా? ఉంటే అందుకు తీసుకోవలసిన కట్టడి చర్యలేమిటి? ఇందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిన పనులేమిటి? అమలు చేయాల్సిన పథకాలేమిటి? తదితర అంశాలతో కూడిన నివేదికను సైతం డీజీపీ సర్కారుకు సమర్పించే అవకాశం ఉందన్నారు. మొత్తంగా డీజీపీ మహేందర్ రెడ్డి నేరుగా అటవీ ప్రాంతాల్లో పర్యటించడం పోలీసు శాఖలోనే కాదు, విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లోనూ ఆసక్తికర చర్చకు ఆస్కారం కలిగించిందనేది నిర్వివాదాంశం.