ప్రభుత్వానికి లొంగిపోయి జవనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా తెలంగాణా డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి మావోయిస్టు నక్సలైట్లకు పిలుపునిచ్చారు. లొంగిపోయిన నక్సలైట్లకు వైద్య సదుపాయాలు కల్పిస్తామని, కరోనా బారిన పడొద్దని డీజీపీ హితవు చెప్పారు. మావోయిస్టు పార్టీ ప్లాటూన్ కమిటీ సభ్యుడు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ లొంగిపోయిన సందర్భంగా డీజీపీ బుధవారం మీడియాతో మాట్లాడారు. రంజిత్ చనిపోయిన మావోయిస్టు నేత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న కుమారుడని చెప్పారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు లొంగిపోవాలని రంజిత్ కోరుతున్నారని కూడా డీజీపీ చెప్పారు. రంజిత్ అనేక యాక్షన్స్ లో పాల్గొన్నాడని, కాసారం, ఎర్రబోరు, మినప, జీరం తదితర దాడుల ఘటనల్లో రంజిత్ నిందితుడని డీజీపీ చెప్పారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా రామన్న అలియాస్ శ్రీనివాస్ స్థానంలో వికల్ప్ అలియాస్ రామచంద్రారెడ్డి నియామకమైనట్లు డీజీపీ వివరించారు. మావోల మెథడాలజీ ఆచరణలో సాధ్యం కాదని రంజిత్ నమ్ముతున్నాడని, రిక్రూట్ మెంట్ వ్యవహారాల్లో రంజిత్ కీలక పాత్ర పోషించాడని మహేందర్ రెడ్డి వివరించారు.
తెలంగాణాలో మావోయిస్టు నక్సల్స్ కార్యకలాపాలు లేవని డీజీపీ మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణాకు చెందిన మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వాళ్లు తెలంగాణాలోకి ప్రవేశించి కార్యకలాపాలు నిర్వహించకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సీఆర్పీఎఫ్ బలగాల సహాయంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నక్సల్స్ కార్యకలాపాలను నియంత్రిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణాకు చెందిన 120 మంది మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్, సుక్మా వంటి జిల్లాల్లో ఉంటున్నారని చెప్పారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదని, ప్రస్తుతానికి దామోదర్ చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు.