రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించిన తెలంగాణా సీఎం కేసీఆర్ మరో ముఖ్యాంశంపైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? కొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించి ప్రకటన చేయబోతున్నారా? రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే సీఎం ఖాళీ పోస్టుల భర్తీ ప్రకటన చేశారని విపక్ష పార్టీల నేతలు చేస్తున్న విమర్శల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఉద్యోగులకు సంబంధించి కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారం ప్రకారం… త్వరలోనే ‘పే రివిజన్ కమిషన్’ (పీఆర్సీ) సిఫారసులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
అయితే 2018 మే నెలలో నియమించిన పీఆర్సీ కమిటీ తన సిఫారసుల నివేదికను సమర్పించే అంశంలో కాలాన్ని సాగదీస్తుండడం గమనార్హం. వాస్తవానికి కమిటీ నియామకమైన 2018 సంవత్సరాంతానికే సిఫారసు రిపోర్టును సమర్పించాల్సి ఉండగా, 2020వ సంవత్సరం కూడా ముగుస్తోందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆరు నెలల చొప్పున గడువు పొడిగింపు కొనసాగుతోందని ఆ వర్గాలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ కమిటీ సిఫారసుల నివేదిక సమర్పణకు ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉంది. కానీ మారిన తాజా ‘రాజకీయ’ పరిణామాల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించవచ్చనే ప్రచారం తాజాగా ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తే అంది ఎంత శాతం వరకు ఉండవచ్చనే అంశంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాభై నుంచి 60 శాతం వరకు ఫిట్మెంట్ ప్రకటిస్తే తప్ప అంగీకరించేది లేదని గతంలో ప్రకటించిన ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తుతం 30 శాతం లోపు ప్రకటించినా సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసే అవకాశం ఉందని ఓ ప్రభుత్వాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇటువంటి పరిణామాల్లో ప్రభుత్వం సుమారు 30 శాతం, లేదంటే కనీసంగా 27 శాతం వరకు పీఆర్సీని ప్రకటించవచ్చని, అయితే అది ఫిట్మెంట్ రూపేణా కాకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.
ఒకవేళ పీఆర్సీ ప్రకటిస్తే అది ఎప్పటి నుంచి ప్రకటిస్తారనే అంశంపైనా భిన్నవాదన వినిపిస్తోంది. కమిటీ నియామకమైన 2018 మే నెల నుంచి ‘పేపర్’ మీద ప్రకటించి, ఇప్పటి నుంచి ఫైనాన్షియల్ ‘బెనిఫిట్’ ఇస్తే మాత్రం ఉద్యోగులకు భారీ నష్టంగానే అభివర్ణిస్తున్నారు. ఫలితంగా మానిటరీ బెనిఫిట్ రాకపోయినా, తదుపరి పీఆర్సీ ద్వారా లబ్ధి చేకూరే అవకాశం మాత్రం ఉందంటున్నారు. మొత్తంగా పీఆర్సీలో ఫిట్మెంట్ ఉండకపోవచ్చని, ఇంటీరియమ్ రిలీఫ్ (ఐఆర్) మాత్రమే ఉండవచ్చంటున్నారు. పీఆర్సీని ప్రకటిస్తే పెండింగ్ లో గల రెండు డీఏలపైనా స్పష్టత ఇవ్వాల్సి వస్తుందని ఉద్యోగ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ఇటువంటి భిన్నాభిప్రాయాల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కొద్దిరోజుల్లోనే పీఆర్సీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఖాళీ పోస్టుల భర్తీకి ఆదేశాలు వెలువడిన నేపథ్యలో పీఆర్సీపైనా ఉద్యోగ వర్గాలు ఆశలను మరింత పెంచుకుంటుండడం విశేషం.