భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెం పోడు భూముల వివాదంపై తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) దృష్టి సారించినట్లు సమాచారం. అంతేగాక ఈ వివాదంలో ఓ జర్నలిస్టు బాగోతంపైనా, అతనికి సన్నిహితంగా ఉన్న టీఆర్ఎస్ నేతల వైఖరి, వ్యాపార బంధాలపైనా సమాచార సేకరణలో సీఎంవో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఆదివాసీ గిరిజనుల్లో పార్టీపై వ్యతిరేక భావనలకు దారి తీసే ప్రమాదమున్నట్లు భావిస్తున్న మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా సీఎంవో కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం… లచ్చగూడెం పోడు భూముల వివాదాన్ని సీఎంవో తీవ్రంగా పరిగణిస్తోంది. ‘భారీ వివాదంలో పింక్ మీడియా జర్నలిస్ట్’ శీర్షికన నిన్న ts29 వెబ్ సైట్ ప్రచురించిన వార్తా కథనం సీఎంవో పెద్దల దృష్టికి వెళ్లింది. వార్తా కథనంలోని అంశాలను నిశితంగా పరిశీలించిన సీఎంవో పెద్దలు వివాదంపై పూర్తి స్థాయి సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. ముగ్గురు మంత్రులు పాల్గొని నాటిన హరితహారం మొక్కలను ధ్వంసం చేయడమేంటి? రూ. కోట్ల విలువైన ఇటుకల తయారీ ఫ్యాక్టరీ కథా కమామీషు ఏంటి? ‘పింక్ మీడియా’ జర్నలిస్టు పాల్పడుతున్న దందాలు ఏంటి? స్థానిక టీఆర్ఎస్ నేతల పాత్ర ఏంటి? తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు.

కాగా అధికార పార్టీకి చెందిన న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్నట్లు పేర్కొంటున్న ‘జర్నలిస్టు’ పూర్తి కార్యకలాపాలపైన కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఖమ్మంలోని ఓ విద్యా సంస్థ నిర్వాహకునితో గల రూ. కోట్ల వివాదం, ఇల్లెందుకు చెందిన సుమారు 30 మంది ఆదివాసీ యువకులను ఈ జర్నలిస్ట్ హైదరాబాద్ కు తీసుకువెళ్లి ‘మాల్స్’ ఏర్పాటు పేరుతో వంచనకు గురిచేసినట్లు ఆరోపణలు గల వ్యవహారంపైనా వివరాలు సేకరిస్తున్నారు. అసలు టీఆర్ఎస్ పెద్దల పేర్లు చెప్పి ఈ జర్నలిస్టు నిర్వహించిన ఆర్థిక దందాలపైనా కూపీ లాగుతున్నారు. ఇంకోవైపు సదరు జర్నలిస్టుతో స్థానిక టీఆర్ఎస్ నేతలకు గల ‘బంధం’పైనా సమగ్ర సమాచారం తెప్పించుకనే పనిలో పార్టీ వర్గాలు నిమగ్నమయ్యాయి.

ఇదిలా ఉండగా ఈ జర్నలిస్టు ప్రస్తుతం అధికార పార్టీ నేతలకు చెందిన న్యూస్ ఛానల్ లో పనిచేయడం లేదని కూడా పార్టీకి చెందిన కీలక నేత ఒకరు తనను కలిసిన బాధితులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అంతేగాక తన కార్యాలయం వైపు ఆ జర్నలిస్టును రానీయవద్దని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదేశించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా లచ్చగూడెం పోడుభూముల వివాదాన్ని సీఎంవో కార్యాలయం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ వ్యవహారం పార్టీకి మరింత నష్టం కలిగించకుండా తదుపరి చర్యలకు ఆదేశాలు వెలువడినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొనడం విశేషం. ఆరోపణలు ఎదుర్కుంటున్న జర్నలిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా స్థానిక నేతలకు ఆదేశాలు అందినట్లు మరోవైపు ప్రచారం జరుగుతుండడం కొసమెరుపు.

Comments are closed.

Exit mobile version