తెలంగాణాలో అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, నాయకులు భూకబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారి ఒకరు సమర్పించిన ఓ నివేదికలో అసెంబ్లీ మాజీ స్పీకర్ పేరు ప్రస్తావనకు రావడం తీవ్ర కలకలానికి దారి తీసింది. మణుగూరు-ఏటూరునాగారం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఉప్పాక రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ స్థలాల కబ్జా బాగోతంపై పినపాక తహశీల్దార్ కె. విక్రమ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కు ఓ నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో అసెంబ్లీ మాజీ స్పీకర్ పేరును ప్రస్తావించడం తీవ్ర చర్చకు దారి తీసింది. నేషనల్ హైవేను అనుకుని ఉన్న సర్వే నెం. 987లో 2.10 ఎకరాలు, సర్వే నెం. 683లో 1.24 ఎకరాలతోపాటు మరో రెండు విలువైన ప్రభుత్వ స్థలాలను బడా రియల్టర్ ఒకరు, కొందరు గిరిజనేతరులు కలిసి కబ్జాకు ప్రయత్నించారని తహశీల్దార్ తన నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలాను పరిరక్షిస్తూ కబ్జాలను అడ్డుకున్నందుకు తనపై ఓ పత్రికలో అడ్డగోలు ఆరోపణలతో వార్తలు రాయిస్తున్నారని తహశీల్దార్ పేర్కొన్నారు. అయితే ఈ నివేదికలో మాజీ స్పీకర్ పేరును తహశీల్దార్ ఉటంకించడమే అసలు విశేషం. తనను లక్ష్యంగా చేసుకుని ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనంపై పినపాక తహశీల్దార్ జిల్లా కలెక్టర్ కు సమర్పించిన వివరణాత్మక నివేదికలో మాజీ స్పీకర్ పేరు ఉండడం గమనార్హం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం… ప్రభుత్వ స్థలాల కబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న స్థానిక రియల్టర్ ఒకరిని ఓ ‘మాఫియా’గా పలువురు అభివర్ణిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ప్రాచుర్యం పొందిన ఈ వ్యక్తి ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే కబ్జా చేయడమే కార్యక్రమంగా పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షెడ్యూల్డు ఏరియాలో 1/70 చట్టాన్ని ధిక్కరిస్తూ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూ, దొడ్డిదారిన విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం ద్వారా బడా రియల్టర్ గా ఎదిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పినపాక తహశీల్దారుతో తీవ్ర వివాదం ఏర్పడిందంటున్నారు. తనపై ఓ పత్రికలో వార్తా కథనాలు ప్రచురితమవుతున్న పరిస్థితుల్లో.., అవి నిరాధారమని తహశీల్దార్ అంటున్నారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించినందుకే భూకబ్జాదారులు, ఇసుక అక్రమ రవాణాదారులు తనపై పథకం ప్రకారం ఓ పత్రికలో వార్తలు రాయిస్తున్నారని తహశీల్దార్ విక్రమ్ కుమార్ కలెక్టర్ కు సమర్పించిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. దాదాపు రూ. 10.00 కోట్ల విలువైనవిగా అంచనా వేస్తున్న ప్రభుత్వ స్థలాల కబ్జాకు ప్రయత్నించినవారి పేరును, ఇసుక అక్రమ రవాణాదారుల పూర్వాపరాలను తహశీల్దార్ వివరంగానే తన నివేదికలో రాశారు. భూకబ్జాదారులు, ఇసుక అక్రమ రవాణాదారులు తనను రాజీ పడాలని ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారని, ఇదే విషయంలో మాజీ స్పీకర్ కూడా కలుగజేసుకుని రాజీ చేసుకోవాలని సూచించారని తహశీల్దార్ విక్రమ్ కుమార్ తన నివేదికలో కూలంకషంగా బట్టబయలు చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నట్లు ఎమ్మార్వో పేర్కొన్న వ్యక్తి పేరు, మాజీ స్పీకర్ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం ఈ సందర్భంగా గమనార్హం.

కాగా పినపాక తహశీల్దార్ విక్రమ్ కుమార్ కు స్థానిక ఆదివాసీ సంఘాలు మద్ధతు పలుకుతుండడం విశేషం. ఈ సందర్భంగా తహశీల్దార్ విక్రమ్ కుమార్ చర్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మచ్చుకు ఓ పోస్టును దిగువన చదవవచ్చు.

ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీ చట్టాలకు అనుగుణంగా పనిచేసే తహాశీల్దార్లు చాలా అరుదుగా ఉంటారు. చట్టాలు అమలు చేస్తుంన్నారని ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో ఇక మనకు మనుగడ ఉండదని ప్రభుత్వ భూములను, అస్సైన్డ్ భూములను కబ్జాలకు గురిచేసి ప్లాటులుగా తయారు చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటుంన్న కొందరు గిరిజనేతరులు, వారి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగవని, చట్టాలకు అనుగుణంగా పనిచేసే తహాశీల్దారుపై ఆ గిరిజనేతరులకు అనుగుణంగా ఉండే కొన్ని పనికి మాలిన పేపర్లతో బురదజల్లే వార్తలు రాయిస్తుంటారు. కానీ కండ్లకు ఏజెన్సీలో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసే రియల్ దందా గురించి మాత్రం రాయడానికి ‘కలం’ కనీసం కదలదు. కానీ పినపాక తహాసిల్దార్ గారి గురించి పదే పదే రెండు రోజుల నుండి వార్త ఒక పత్రిక పనికట్టుకొని రాస్తోంది. ఎందుకు రాస్తున్నారో, ఎవరికీ నొప్పి కలిగితే రాస్తున్నారో తెలుసుకోగలరు. ఆదివాసులు ఇలాంటి తహాశీల్దార్ లాంటి వారికి సపోర్ట్ చెయ్యండి. లేదంటే ఆదివాసుల కోసం పనిచేసే ఏ ఒక్క అధికారి కూడా నాకెందుకు అని గిరిజనేతరులు చెప్పింది వినుకుంటు, ఆదివాసులకు అన్యాయం చేస్తూ వెళ్తారు. జై భీం. జై ఆదివాసీ.

Comments are closed.

Exit mobile version