ఎమ్మెల్యే, గిమ్మెల్యే జాన్తా నై!
తీగ దొరికిన విధమిదేనా?
టార్గెట్ ఎమ్మెల్యే పదవి
రాజ ద్రోహం కూడానా!?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అదో నియోజకవర్గం. దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడే. ఈ ఎమ్మెల్యే సొంత ఊళ్లో రూ. కోటి విలువైన పనులకు సంబంధించి ఆఘమేఘాల మీద బిల్లు మంజూరైంది… అత్యంత వేగంగా చెల్లింపులు కూడా జరిగిపోయాయి. పనిలో నాణ్యత ఉందా? లేదా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. జరిగిన పనికి బిల్లు చెల్లించడం రివాజే కావచ్చు. కానీ అంతకు ముందు పనులు పూర్తి చేసి బిల్లుల కోసం ‘క్యూ’లో గల కాంట్రాక్టర్లను కాదని ఈ కోటి చెల్లింపు మాత్రం జెట్ స్పీడ్ లో జరిగిపోయింది. విషయం తెలిసి ఎమ్మెల్యే మథనపడ్డారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో, కనీసం తన సిఫారసు లేఖ కూడా లేకుండా పని జరగడమేంటో? వెయిటింగ్ లో గల అనేక మంది కాంట్రాక్టర్లను తోసిరాజని ముందుగానే ఈ చెల్లింపులు జరగడమేంటో? అందుకు మంత్రి కూడా సహకరించడమేంటో? అనే ప్రశ్నలకు సమాధానం తెలియక ఎమ్మెల్యే బుర్ర గోక్కున్నారు. ‘ఇదేం పద్ధతి? నాకు కనీసం సమాచారం ఇవ్వరా? నేను ఎమ్మెల్యేను కాదా?’ అని సదరు కాంట్రాక్టర్ నే ప్రశ్నించారు. ‘నాకు ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా సీఎంవో ఆఫీసులో గల మా ‘అన్న’ మాత్రమే. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేసుకుంటావో చేసుకో ఫో’ అని కాంట్రాక్టర్ తలెగరేశాడు. దిక్కుతోచని ఆ ఎమ్మెల్యే మిన్నకుండిపోయారు. ఇది సినిమా సీన్ కాదు… తెలంగాణా సీఎంవో కార్యాలయం నుంచి ఉద్వాసనకు గురైన ఓ ఉద్యోగి ఆధిపత్య ధోరణికి ఉదాహరణ మాత్రమే. ఉద్వాసనకు గురైన ఉద్యోగి చెప్పిందే తడవుగా సంబంధిత మంత్రి కూడా నిస్సహాయంగా బిల్లు చెల్లింపునకు ఆదేశాలు జారీ చేశారట.
ఎమ్మెల్యే, గిమ్మెల్యే జాన్తా నై:
అంతేకాదు… ఎమ్మెల్యే అయినా సరే, ఈ ఉద్యోగి సొంత మండలంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. కనీసం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించడానికి వీల్లేదు. కాదని వస్తే పార్టీ కార్యకర్తలతో అడ్డుకుంటాం. ఇక్కడ ఏది చేసిన మా కుటుంబీకులే చేయాలి. ఇదీ ఉద్వాసనకు గురైన ఉద్యోగి కుటుంబ సభ్యుని రాజకీయ పోకడ. కక్కలేక, మింగలేక ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మిన్నకుండిపోవలసిన పరిస్థితి. సంచలనాత్మక రీతలో సీఎంవో నుంచి గెంటివేయబడ్డ ప్రభుత్వ ఉద్యోగి అంతర్లీన ‘రాజకీయ’ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిర్ఘాంతపోయే అనేక అంశాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. తనకు నిర్దేశించిన విధులను విస్మరించి సర్వాంతర్యామిగా తనకు తాను భ్రమించి చేసినట్లు ప్రచారంలో గల నిర్వాకాలపై సర్కార్ నిఘా వర్గాలు సైతం విస్తుపోతున్నాయట. ఎమ్మెల్యేలను, మంత్రులను శాసించే స్థాయికి ఉద్వాసనకు గురైన ఓ ఉద్యోగి ఎదగడమే విచిత్రంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఏ విషయంలోనైనా సరే, ‘పెద్ద సారు చెప్పిండ్లు’ అనే ఏకవాక్యంతో అనేక దందాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. పెద్ద సారు పేరు చెప్పాక విషయాన్ని నిర్ధారించుకునే అవకాశం ఇక్కడ లేకపోవడమే అతని దందాలకు అడ్వాంటేజీగా చెబుతున్నారు.
తీగ దొరికిన విధంబెట్టిదనినన…:
ఇప్పటి వరకు వ్యాప్తిలో గల అతని దందాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, తాజాగా మరికొన్ని కీలక ఉదంతాలపై జోరుగా ప్రచారం సాగుతోంది. రాజధాని శివార్లలోని మొయినాబాద్ ప్రాంతంలో రూ. 240 కోట్ల విలువైన భూదందాలో కూడా ఉద్వాసనకు గురైన ఉద్యోగి తలదూర్చినట్లు ప్రచారపు సారాంశం. తన సామాజికవర్గం, సన్నిహిత అధికారులతో కలిసి భారీ ఎత్తున ‘విల్లాల’ నిర్మాణ పర్వానికి తెరలేపిన ఈ ఉద్యోగి ఈ భూముల రిజిస్ట్రేషన్ ఫీజు కోసమే రూ. 24 కోట్ల నిధులను సర్దారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తం నిధులు ఒకేసారి ఎలా సమకూరాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ప్రభుత్వ శాఖ నుంచి అదే మొత్తపు నిధులను కొల్లగొట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఈ భూముల రిజిస్ట్రేషన్ కు వెచ్చించిన మొత్తం ఆయా నిధులేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. పది శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా పరిగణించినా ఈ భూదందా విలువ రూ. 240 కోట్ల మొత్తంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ భూముల రిజిస్ట్రేషన్ వివాదాస్పదంగా మారడం వల్లే ఉద్యోగి ఉద్వాసనకు ప్రధానంగా దారి తీసినట్లు భావిస్తున్నారు. మొయినాబాద్ భూదందాలో తన సామాజిక వర్గానికి చెందిన తొమ్మిది మంది సన్నిహితులను భాగస్వామ్యం చేసి, ఆయా వ్యక్తుల భార్యలపై భూ రిజిస్ట్రేషన్లు చేయడం విశేషంగా తెలుస్తోంది. అందరూ తమ భార్యల పేర్లపైనే భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్లే భూదందాలో ఉద్వాసనకు గురైన ఉద్యోగి ప్రమేయపు తీగ దొరికిందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టార్గెట్ ఎమ్మెల్యే పదవి:
అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మానుకోటకు చెందిన పార్టీ ముఖ్యనేత ఒకరి భాగస్వామ్యంతో ఈ ఉద్యోగి ‘రియల్’ లింకులపై కూడా భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. సాధారణ రాజకీయ కుటుంబం నుంచి సీఎంవో ఉద్యోగి వరకు అత్యంత వేగంగా ఎదిగిన ఇతను రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులతోనూ కోట్లాది రూపాయల భూ, ఇతర దందాల స్థాయికి ఎదిగినట్లు ప్రచారం జరుగుతోంది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెతను అనుగుణంగా ఉద్వాసనకు గురైన ఉద్యోగి వివాదాస్పద వ్యవహార తీరు వెనుక బలమైన రాజకీయ లక్ష్యం దాగి ఉన్నట్లు కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన సొంత మండలం కేంద్రంగా కొత్త అసెంబ్లీ స్థానం ఏర్పడుతుందని, లేదంటే ప్రస్తుతం తన మండలంతో కూడిన శాసనసభ స్థానం నుంచే రాజకీయ లక్ష్యాన్ని చేరుకునేందుకే భారీ దందాలతో నిధులు పోగేసుకున్నట్లు అతని సన్నిహిత వర్గాలు భిన్న రకాలుగా చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భాంగానే ఎమ్మెల్యే టికెట్ కోసం విఫలయత్నం చేశారనే వాదన కూడా ఉంది. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఎదగాలనే రాజకీయ కాంక్షను ఎంచుకుని సీఎంవోలోని తన ఉద్యోగ పరపతికి అదనంగా ‘పెద్దసారు’ పేరును వాడుకుని అడ్డదారి దందాలకు ఉపయోగించుకున్నారని, చివరికి శూన్య స్థానానికి చేరుకోవడమే విషాదంగా ఉద్వాసనకు గురైన ఉద్యోగి వ్యవహారతీరును అధికార పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
రాజ ద్రోహం కూడానా!?
అక్రమ వ్యవహారాలు, సెటిల్మెంట్లు, భూ దందాలు, రియల్ ఎస్టేట్ బాగోతాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఉద్యాసనకు గురైన ఉద్యోగి రాజద్రోహానికి కూడా పాల్పడ్డాడా? ఇదీ తాజా చర్చ. సీఎంవోగా ‘పవర్’ఫుల్ వ్యక్తిగా ప్రాచుర్యం పొందిన ఇతనితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఫోన్ లో మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఢిల్లీకి రప్పించుకుంటామని, కీలక పోస్ట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారనే ప్రచారం తాజాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఇందులో వాస్తవ, అవాస్తవాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, తాను ఎంచుకున్న రాజకీయ స్థానాన్ని చేరుకోవడానికి ఉద్వాసనకు గురైన ఉద్యోగి త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తాను టార్గెట్ గా ఎంచుకున్న స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆశ్యర్యం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇతని అక్రమ సంపాదనపై ఏసీబీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించవచ్చనే వార్తలు వస్తున్న పరిణామాలు మున్ముందు ఎటు దారి తీస్తాయనేది వేచి చూడాల్సిందే!