తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్వోల్లో ఒకరైన గటిక విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. సాధారణంగానైతే ఇది ఆసక్తకికర వార్త కాకపోవచ్చు. కానీ సీపీఆర్వో హోదాలో గల వ్యక్తిని మించి ప్రముఖ వ్యక్తిగా ప్రాచుర్యం పొందిన విజయ్ కుమార్ ఆకస్మాత్తుగా తన పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఇదీ మీడియా వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్న సందేహం. సీఎం కేసీఆర్ చీఫ్ పీఆర్వో జ్వాలా నరసింహారావు అయినప్పటికీ, కేసీఆర్ పర్యటనల్లోగాని, ఆయన నిర్వహించే ముఖ్య అధికారిక సమావేశాల్లోగాని విజయ్ కుమార్ మాత్రమే ప్రముఖంగా కనిపిస్తుంటారు. కేసీఆర్ వెనకాలే విజయ్ కుమార్ తరచూ ఉంటుంటారు. ఓ ముఖ్యమంత్రి వద్ద ఇంతటి స్థానాన్ని సంపాదించిన విజయ్ కుమార్ ఎదుగుదల అత్యంత వేగమనే చెప్పాలి.
ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి సాధారణ కంట్రిబ్యూటర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించిన విజయ్ కుమార్ ఆ తర్వాత మహబూబాబాద్ వార్త ఆర్సీ ఇంచార్జిగా, ఖమ్మం ఎడిషన్ లో సబ్ ఎడిటర్ గా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీ న్యూస్ ఛానళ్లలో రిపోర్టర్ గా పనిచేశారు. వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత తక్కళ్లపల్లి రవీందర్ రావుతో సన్నిహిత సంబంధాలు గల విజయ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే తడవుగా ఏకంగా సీఎం పీఆర్వో పోస్టులో నియమితులయ్యారు. కేసీఆర్ పై పుస్తకాలు రాయడం ద్వారా ఆయనకు మరింత సన్నిహితమయ్యారని పలువురు చెబుతుంటారు. ఒకానొక దశలో సీఎం కేసీఆర్ పై భరీ ఎత్తున సినిమా తీసే స్థాయికి విజయ్ కుమార్ ఎదిగారు. అయితే క్లాప్ కొట్టిన ఆ సినిమా చిత్రీకరణ తర్వాత ఏమైందనే అంశంపై స్పష్టత లేదు.
ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం పీఆర్వోగా విజయ్ కుమార్ పనిచేస్తున్నారు. విజయ్ కుమార్ కోసమే ట్రాన్స్ కో సంస్థలో జనరల్ మేనేజర్ (కమ్యునికేషన్స్) పదవిని క్రియేట్ చేశారనే ప్రచారమూ ఉండనే ఉంది. పీఆర్వోగా నియమితుడైన కొత్తలో విజయ్ కుమార్ కొన్ని అంశాల్లో వివాదాస్పదమయ్యారు కూడా. జనగామ తదితర ప్రాంతాల్లోని పలు ఘటనల్లో విజయ్ కుమార్ వ్యవహరించినట్లు ప్రచారంలో గల వివాదాస్పద అంశాలపై అప్పట్లో పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ సీఎం కేసీఆర్ ఇవేవీ పట్టించుకోకపోవడం విశేషం. గడచిన ఆరున్నరేళ్లుగా సీఎం పీఆర్వోగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన విజయ్ కుమార్ ను కేసీఆర్ నిన్న రాత్రి పొద్దుపోయాక పిలిపించుకుని మరీ రాజీనామా లేఖను కోరారనే ప్రచారం జరుగుతోంది. తన పీఆర్వో పదవికి రాజీనామా చేస్తున్నానని, వ్యక్తిగత కారణాలే ఇందుకు కారణమని, తనకు గొప్ప స్థానం కల్పించిన కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని విజయ్ కుమార్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో వెల్లడించారు.
అయితే ఉన్నట్టుంది విజయ్ కుమార్ తన పీఆర్వో పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఇందుకు దారి తీసిన పరిణామాలేమిటి? అనే ప్రశ్నలపై భిన్న కోణాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు వ్యక్తిగత కారణాలు మాత్రమేనని విజయ్ కుమార్ చెబుతున్నప్పటికీ, ఓ ముఖ్యమంత్రి వద్ద కీలక భూమికను పోషిస్తున్న పాత్ర నుంచి ఆయన వైదొలగడానికి విజయ్ పేర్కొన్న కారణాన్ని మీడియా వర్గాలు అంతగా విశ్వసించడం లేదు. ట్రాన్స్కోలో ఆయన కోసం క్రియేట్ చేసిన జనరల్ మేనేజర్ కొలువు నుంచి కూడా విజయ్ ను తొలగించారనే ప్రచారం ధ్రువపడాల్సి ఉంది. పీఆర్వో హోదాకు విజయ్ రాజీనామా చేశారనే వార్త సంగతి ఎలా ఉన్నప్పటికీ, చివరికి ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఆయనను తొలగించారనే ప్రచారం నిజమైతే మాత్రం కేసీఆర్ కు అంతగా ఆగ్రహం కలిగించే విధంగా విజయ్ కుమార్ చేసిన నిర్వాకాలేమిటి? అనే అంశంపై అధికారికంగానే స్పష్టత రావాలసి ఉందని మీడియా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.