ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో మాదిరిగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే జరగబోయే పరిణామాలపై తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ – పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేవిధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తన ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదని, క్రమశిక్షణను ఉల్లంఘించి, తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే, తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని ముఖ్యమంత్రి మరోమారు ప్రకటించారు.
మంగళవారం ప్రగతి భవన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సిఎం కేసీఆర్ పాల్గొని తెలంగాణ వైఖరిని స్పష్టం చేశారు.
రెండు గంటలపాటు కొనసాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకున్న న్యాయమైన హక్కులు, వాటాల గురించి అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తోపాటు, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లకు తెలంగాణ వైఖరిని విస్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ, నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అని అన్నారు. భారత యూనియన్ లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర నదీజలాల్లో న్యాయమైనవాటాను పొందే హక్కు ఉన్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతామని సీఎం స్పష్టం చేశారు.
కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఈదిశగా స్వయంగా కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ కొనసాగించడం బాధాకరమన్నారు. ఆయకట్టు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలానికి గండిపెడుతూ నిర్మితమవుతున్న పోతిరెడ్డిపాడు కెనాల్ ను తెలంగాణ ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నదని, అయినా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పోతిరెడ్డి పాడును మరింత విస్తరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నదీ జలాల వివరాలను సోదాహరణంగా కేంద్రానికి వివరించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ప్రారంభంలోనే, అనగా 2014 జులై 14న, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956-సెక్షన్ 3 కింద ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తాము కేంద్రానికి లేఖ రాశామని, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చేత, ఒక సంవత్సరం వేచిచూసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని సిఎం పేర్కొన్నారు. తక్షణమే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు.
కాగా కేంద్రమంత్రి షెకావత్ మాట్లాడుతూ, తెలంగాణ డిమాండ్ ను అంగీకరిస్తామంటూనే సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వేసిఉన్న కారణంగా తాము ఎటువంటి చర్య తీసుకోలేకపోతున్నామన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్, కేంద్రం గనుక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే సుప్రీం కోర్టులో కేసును వెనక్కి తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదన్నారు.