‘‘కేసీఆర్ చెప్పిండంటే ఖతర్నాక్ ఉంటది. సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటాం. ప్రతి అంశాన్ని ప్రభుత్వం పరిశీలనతో రికార్డు చేస్తుంటుంది. సర్కార్ చూడడం లేదని అనుకోవద్దు. ఇటువంటి రాతలు రాసేవారికి కరోనా సోకాలని కోరుకుంటున్నా. కరోనా విపత్తులోనూ కొన్ని పత్రికలు విషపు రాతలు రాస్తున్నాయి. ఇది దుర్మార్గం. హేయం. అంటూ తెలంగాణా సీఎం కేసీఆర్ ఓ పత్రికపై విరుచుకుపడ్డారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, మున్ముందు అనుసరించాల్సిన వ్యూహాన్ని వివరిస్తూ సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
లాక్ డౌన్ కట్టడి అంశంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని, లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రధానిని కోరుతున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ఇదే సమయంలో ఆంధ్రజ్యోతి రాసిన ఓ వార్తా కథనాన్ని కేసీఆర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. విలేకరుల సమావేశంలో ఆంధ్రజ్యోతి పత్రిక పేరునుగాని, దాని యజమాని రాధాకృష్ణ పేరునుగాని కేసీఆర్ ప్రస్తావించకపోయినప్పటికీ, వార్తా కథనపు శీర్షికను ఉటంకించడం గమనార్హం. ‘వైద్యులకేదీ రక్షణ’ అంటూ వెకిలి రాతలు రాస్తారా? వైద్యులకు ప్రభుత్వం కాకుంటే రాతలు రాసిన వాళ్లు రక్షణ కల్పిస్తారా? అని ప్రశ్నించారు. కరోనా వంటి విపత్తు ఆపత్కాలంలో సేవలందిస్తున్నవారిలో, వాటిని స్వీకరిస్తున్న ప్రజల్లో మరింత ఆత్మస్థయిర్యం నింపే వార్తలు రాయాలే తప్ప, అధైర్యం కలిగించే విధంగా పత్రికలు రాయవద్దని కేసీఆర్ హితవు చెప్పారు. పీపీఈ కిట్లు లేవని రాస్తారా? కిట్ల గురించి అసలు అవగాహన ఉందా? అని కేసీఆర్ పరోక్షంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తాను మీడియాకు వ్యతిరేకం కాదని, అసత్యాలు ప్రచారం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి విపత్తుల్లోనే సంస్కారులెవరో, కుసంస్కారులెవరో బహిర్గతమవుతుందన్నారు.