యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో తెలంగాణా ముఖ్య‌మంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగ‌ళ‌వారం మధ్యాహ్నం యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు.
సీఎం కేసీఆర్ ఏరియ‌ల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆల‌య అభివృద్ధి పనులతోపాటు, ప‌రిస‌రాల‌న్నింటినీ ప‌రిశీలించారు.

తొలుత మధ్యాహ్నం 12.40 గంటలకు యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్, యాదాద్రి ఆలయ ఈవో గీత, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు సీఎం కేసీఆర్ కు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పలశ్రీనివాస్ గుప్త, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు.

అనంతరం కాన్వాయ్‌లో ఘాట్ రోడ్డు ద్వారా ముఖ్యమంత్రి నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక అర్చన చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అక్కడి నుంచి ముఖ్యమంత్రి వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సీఎం కేసీఆర్ తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును సీఎం సహచర మంత్రులతో పంచుకున్నారు.

Comments are closed.

Exit mobile version