‘దళిత బంధు’ పథకంపై తెలంగాణా సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పథకం ప్రారంభ తేదీకి ముందే మరో ప్రాంత లబ్దిదారులకు ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. వాస్తవానికి దళిత బంధు పథకాన్ని ఈనెల 16వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించాలని అధికారికంగానే నిర్ణయించారు. రైతు బంధు ప్రారంభమైన చోటే దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. కరీంనగర్ జిల్లా తనకు సెంటిమెంట్ గా భావిస్తానని, అందువల్లే దళిత బంధు పథకాన్ని కూడా అదే జిల్లాలో ప్రారంభించనున్నట్లు సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే దళిత బంధు పథకాన్ని ఈనెల 16న ప్రారంభించడానికి ముందే సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం వాసాలమర్రి దళితుల ఖాతాల్లో ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. దత్తత గ్రామం వాసాలమర్రిలో బుధవారం పర్యటించిన సీఎం అనూహ్యంగా దళిత బంధు పథకాన్ని రేపు ఇక్కడి దళిత లబ్ధిదారులకు అమలు చేయనున్నట్లు ప్రకటించడం ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వాసాలమర్రికి చెందిన 76 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 7.60 కోట్ల నిధులను జమ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఒకే విడతలో ఈ నిధులను విడుదల చేయనున్నట్లు కూడా సీఎం చెప్పారు.
వాసాలమర్రి పర్యటనలో సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ పరిశీకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 16న హుజూరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించాల్సిన దళిత బంధు ప్రారంభ కార్యక్రమానికి ముందే వాసాలమర్రిలో అమలు చేస్తుండడంపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సీఎం హుజూరాబాద్ పర్యటనకు ముందే ఉప ఎన్నికల నోటిఫికేషన్ సంకేతాలు ఉండవచ్చనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. ఈనెల 16న సీఎం పర్యటనకు ముందే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడితే పథకం ప్రారంభానికి ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాసాలమర్రిలో సీఎం అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. రేపు వాసాలమర్రికి చెందిన లబ్ధిదారుల ఖాతాల్లో దళిత బంధు నిధులు జమ అయితే ‘ఆన్ గోయింగ్ స్కీం’గా పరిగణలోకి వస్తుందని అంటున్నారు. మొత్తంగా వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ చర్చకు తావు కల్పించింది.