తెలంగాణా రైతాంగానికి సీఎం కేసీఆర్ అందించే తీపి కబురు గడువు సమీపిస్తోంది. వారం రోజుల్లోనే రైతులకు తీపి కబురు చెబుతానని, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి వార్త చెబుతానని, దేశం యావత్తూ ఆశ్చర్యపోతుందని కేసీఆర్ చేసిన ప్రకటనకు నాలుగు రోజులు పూర్తయింది. గడువు ప్రకారం మరో మూడు రోజుల్లో కేసీఆర్ తీపి కబురు అందించవచ్చని యావత్ తెలంగాణా రైతాంగమే కాదు, రాజకీయ పరిశీలకులు సైతం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. గత నెల 29వ తేదీన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ‘రైతులకు తీపిక కబురు’ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ప్రకటించే తీపి కబురుపై రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. కానీ గడచిన నాలుగు రోజుల్లో అనేక అంశాలను బేరీజు వేసి, విశ్లేషించి, క్రోఢీకరించిన పరిణామాలు కేసీఆర్ ఆలోచన బహుషా ఇదే కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇందుకు బాటలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నియంత్రిత సాగుకు, కేసీఆర్ ప్రకటించే ‘తీపి కబురు’కు స్పష్టమైన లంకె ఉన్నట్లు గోచరిస్తోంది.
తాజాగా సర్కారు ప్రతిపాదిస్తున్న సేద్యపు అంశానికి వస్తే… రైతులందరూ మూస పద్ధతిలో ఒకేరకం పంటలు సాగు చేసి గిట్టుబాటు ధర లభించకుండా నష్టపోవద్దనేది నియంత్రిత సాగు ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగానే ఈ వానాకాలం సీజన్ నుంచే ప్రభుత్వం నిర్ణయించిన, నిర్దేశించిన పంటలను మాత్రమే రైతులు నియంత్రిత పద్దతిలో సేద్యం చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైతుబంధు సాయాన్ని నిలిపివేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల ఆహారపు అలవాట్లు, మార్కెట్లో డిమాండుకు అనుగుణంగా పంటలు ఉండాలన్నది ప్రభుత్వం ధ్యేయంగా చెబుతున్నారు.
ఓకే… ప్రభుత్వం చెప్పిన ప్రకారమే రైతులు నియంత్రిత సాగు చేస్తారు. నిర్దేశించిన పంటలు మాత్రమే పండిస్తారు. కానీ రైతుకేంటి అదనపు ప్రయోజనం…? ఇదే కదా అసలు ప్రశ్న. రైతుబంధు సాయం సంగతి వదిలేయండి. సీఎం కేసీఆర్ సరిగ్గా ఇక్కడే రైతుకు ‘తీపి’ కబురు అందించే అవకాశం ఉందని ఓ అంచనా. ‘మీరు పండించండి… మేం కొంటాం…’ అని కేసీఆర్ సంచలన ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల తాను పండించే పంటపై రైతుకు ఎక్కడా లేని ధీమా ఏర్పడుతుంది.
పంటలవారీగా ప్రభుత్వం ముందే ధరను ప్రకటిస్తుంది. పత్తి, మిర్చి, కందులు, వరి… పంట ఏదైనా సరే… నియంత్రిత సేద్యం నుంచే వచ్చిన దిగుబడి మాత్రమే అయి ఉండాలి. ముందే ప్రకటించిన ధరకు నియంత్రిత సేద్యపు పంటలను రైతు నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల మార్కెట్లో గిట్టుబాటు ధర, హెచ్చు, తగ్గుల వ్యత్యాసం ఉండకపోవచ్చు. రైతులు పండించే పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఏం చేస్తుందనే సందేహానికి వస్తే… అందుకు సంబంధించిన ప్రణాళికలను కూడా తయారు చేసినట్లు తెలుస్తోంది.
ఉదాహరణకు కనీస ధర లేక, టమాటా నిల్వలను రైతులు రోడ్లపై పారబోసిన, పశువులకు ఆహారంగా అందించిన ఘటనలు అనేకం. ఇటువంటి దయనీయ సందర్భాలు రైతులకు ఎదురుకాకపోవచ్చు. ప్రభుత్వమే టమాటా పంట నిల్వలను ముందే ప్రకటించిన ధరలకు కొనుగోలు చేసి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ‘టమాటా సాస్’ వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు. తద్వారా ఆయా ఉత్పత్తులను వాణిజ్య సంస్థలకు విక్రయించే బాధ్యతను కూడా తీసుకోవచ్చు. మిగతా పంటలను కూడా ఇదే తరహాలో ప్రభుత్వం ‘వ్యాపార’ ధోరణితో సైతం విక్రయించి రైతును అదుకునే దిశగా ప్రణాళికలు రూపొందించి ఉండవచ్చు.
పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించడం వేరు. పాలకులు గిట్టుబాటు ధర ప్రకటించినంత మాత్రాన మార్కెట్లో ఆ ధర సైతం లభించక కర్షకులు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు అనేకం. ఈ నేపథ్యంలోనే రైతు కష్టపడి పండించిన పంట నిల్వలను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వమే నేరుగా స్వీకరించడం సరికొత్త యోచన. యావత్తు దేశం నివ్వెరపోయే అంశమే. ఇది తెలంగాణా రైతుకు ‘తీపి’ కబురు లాంటిదే. ఓ రకంగా రైతు కన్నీటి సేద్యానికి భరోసా. తన కష్టం ఎక్కడికీ పోదనే విశ్వాసం ఏర్పడుతుంది. ‘మీరు పండించండి… మేం కొంటాం’ అనేదే కేసీఆర్ అందించే ‘తీపి’ కబురు ఆలోచన కావచ్చనేదే తాజా అంచనా.