తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి, పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీర్లను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలను ఎంచుకున్నారు. ఈనెల 19 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను తానే స్వయంగా చేపడుతానని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి జూన్ 13 న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల( డీపీవో) లతో ప్రగతి భవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా సీఎం ప్రకటించారు.