వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదని, అందిన తర్వాత దానిపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారని అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లడమా? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.