తెలంగాణా రాష్ట్రంలోని రెండు కీలకమైన ఇంజనీరింగ్ విభాగాల ముఖ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమ, మంగళవారాల్లో విస్తృతస్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నీటి పారుదల శాఖ, మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆర్ అండ్ బి శాఖ మంత్రులు, ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత పెరిగింది. సాగునీటి శాఖ ప్రాధాన్యతను గుర్తించిన కేసీఆర్ ఆ శాఖను పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం నీటి పారుదల శాఖ చిలువలు, పలువలుగా ఉంది. భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడిసి, ప్రాజెక్టులు, ప్యాకేజీలు పేరుతో విభజించి ఉంది. ఇదంతా ఒకే గొడుకు కిందికి రావాలని, తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని సీఎం భావించారు.
అందుకే నీటి పారుదల శాఖను 15-20 ప్రాదేశిక విభాగాలుగా మార్చి, ఒక్కో దానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్ ను ఇంచార్జిగా నియమించాలని నిర్ణయించారు. ఆ సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యామలు సమస్తం ఉంటాయి. దీనికి సంబంధించి ముసాయిదా తయారు చేయాలని గతవారం జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ రెండు రోజుల పాటు నీటిపారుద శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్ షాపు నిర్వహించి ముసాయిదాను రూపొందించారు. దీనిని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమర్పిస్తారు. ఈ ముసాయిదాపై సమీక్షలో సర్వ సమగ్ర చర్చ జరిపి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం కార్యదర్శి, ఇఎన్సీలు, సీఈలు పాల్గొంటారు.
అదేవిధంగా తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం నాటి సమీక్షలో డిజైన్లపై చర్చిస్తారు. సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చిస్తారు. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. ఆర్ అండ్ బి సమీక్షలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్గొంటారు.