తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీలకు చెందిన నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యను క్లుప్తీకరించిన శీర్షిక ఇది. ‘ఢిల్లీ వెళ్లి భూకంపం సృష్టించి.. బీజేపీ నాయకులను గజగజ వణికిస్తున్న కేసీఆర్..!’ అనేది క్తుప్తీకరించిన శీర్షికకు పూర్తి వ్యాఖ్య. తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలుసుకుంటున్న సమయంలో, వారికి నమస్కరిస్తున్న కేసీఆర్ ఫొటోలను ఆయా ‘కామెంట్’కు విపక్ష పార్టీలు ఓ ‘విశేషం’గా వినియోగించుకుంటున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లతో భేటీ సందర్భంగా మర్యాదపూర్వకంగా కేసీఆర్ వారికి నమస్కరిస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఫొటోలను ఆయా వ్యాఖ్యతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తుండడం విశేషం.
ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పరిపాలకునిగా కేసీఆర్ మాత్రమే కాదు, ఏ పార్టీకి చెందిన పరిపాలక నాయకుడైనా కేంద్ర పాలకులను కలవడాన్ని తప్పు పట్టాల్సిందేమీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, ఆర్థిక అంశాలు, తమ తమ రాష్ట్రాల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉంటాయనేది కాదనలేని వాస్తవం. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ పరిణామాల్లోనూ కేంద్ర ప్రభుత్వ పాలక పార్టీ నేతలను ఇతర పార్టీలకు చెందిన రాష్ట్రాల పరిపాలకులు కలవడాన్ని తప్పు పట్టాల్సిందేమీ లేదు. తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి ఇటువంటి అనేక అంశాలను ప్రస్తావించినట్లు తాజాా వార్తల సారాంశం. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ విస్తరణ పనుల అనుమతి, బీఆర్జీఎఫ్ బకాయిల విడుదల, పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు, హైదరాబాద్ వరద బాధితుల సహాయం కోసం నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అభ్యర్థించినట్లు వార్తలు వెలువడ్డాయి.
వాస్తవానికి కేంద్ర మంత్రులతో భేటీ అయిన సందర్భంగా తాను ఏం మాట్లాడిందీ సీఎం కేసీఆర్ మాత్రం మీడియాకు వెల్లడించకపోవడం గమనార్హం. అంతేకాదు హెం మంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లతో ఏకాంతంగా భేటీ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. గజేంద్రసింగ్ షెకావత్ తో సీఎం కేసీఆర్ సమావేశమైన సందర్భంగా జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం కూడా దాదాపు 15 నిమిషాలపాటు అక్కడే ఉన్నారట. అయితే తాను కేంద్ర మంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడుతానని కేసీఆర్ అనడంతో ఆయన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారట. అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా కేసీఆర్ ఏకాంతంగా భేటీ అయ్యారట. దాదాపు 40 నిమిషాలపాటు కేసీఆర్ అమిత్ షాతో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ వెంట వెళ్లిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లు కూడా సీఎం నివాసంలోనే ఉండిపోయారట. కేంద్ర మంత్రుల ఇళ్లకు కేసీఆర్ వెళ్లిన సందర్భంగా ఆయన వెంట వెళ్లిన ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, సీఎం పర్సనల్ అసిస్టెంట్ కూడా బయటే ఉండిపోయినట్లు ఢిల్లీ నుంచి వెలువడిన వార్తలు చెబుతున్నాయి. ఆదివారం రాత్రి వరకు ఢిల్లీలోనే మకాం వేయనున్న కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతోనూ, మరికొందరు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నట్లు తాజా సమాచారం. బహుషా ఈ భేటీలు కూడా ఏకాంతంగానే జరగవచ్చనే ప్రచారం జరుగుతోంది.
అయితే సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో ఏకాంత భేటీలకే ప్రాదాన్యతనిస్తున్న దృశ్యాలు మాత్రం సహజంగానే భిన్నచర్చకు తావు కల్పిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వెడతానని, కేంద్రంలో ప్రకంపనలు సృష్టిస్తానని, ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని సీఎం గతంలో చేసిన ప్రకటనలను రాజకీయ ప్రత్యర్థులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అంతే కాదు నిన్న గాక మొన్ననే ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్ధతు ప్రకటించి, రాష్ట్ర బంద్ నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ చీఫ్ ఢిల్లీ పర్యటన, కేంద్ర మంత్రులతో ఏకాంత భేటీలపై భిన్న కోణాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రంపై కేసీఆర్ యుద్ధానికి సిద్ధపడినట్లయితే ఢిల్లీలోనే గల రైతుల పోరాట దీక్షా స్థలికి వెళ్లి ప్రసంగిస్తారా? పనిలో పనిగా కేంద్రంపై గట్టి యుద్ధం చేస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మద్ధతు ప్రకటిస్తారా? ఇవీ విపక్ష పార్టీలకు చెందిన వర్గీయుల తాజా సందేహాలు.
యాధృచ్చికమో, కాకతాళీయమోగాని కేసీఆర్ ఢిల్లీ పర్యటన రోజే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ మహానగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముందస్తుగా ప్రారంభించడం మరో విశేషం. తెలంగాణా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, దుబ్బాక, జీహెచ్ఎంసీ ప్రజలు తొలి, మలి అడుగులు వేశారని, వరంగల్ ప్రజలు మూడో అడుగు వేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు వరంగల్ నగర అభివృద్ధి కోసం కేంద్రం రూ. వందలాది కోట్లను కేటాయిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణా బీజేపీ నేతలు వరంగల్, ఖమ్మం నగరాల మున్సిపల్ ఎన్నికలకు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు కార్యోన్ముఖులై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న క్రమంలోనే సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చేస్తున్న ‘ఏకాంత’ భేటీలు ఎటువంటి సంకేతాలను ఇస్తున్నాయి? ఇదీ రాజకీయంగా సాగుతున్న తాజా ఆసక్తికర చర్చ.