అత్యంత దైవ భక్తి పరాయణుడు, పరమాత్మ కొలువులో పొర్లుదండాలు పెట్టే పరమ భక్తుడు, అకుంఠిత భక్తి, శ్రద్ధలతో మహా చండీయాగం నిర్వహించి, దేశదేశాల బంధు, మిత్రులను ఆహ్వనించి, పరమేష్టి అనుగ్రహం పొందిన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చందరశేఖరరావేనా…? ‘లాక్ డౌన్’లో ఇలాంటి నిర్ణయం చేపట్టిందని ఆశ్చర్యం కలిగిస్తున్నది!
పరమేశ్వరాలయాలకంటే, పానశాలలకు ప్రాధాన్యమా? అకటా!
ఇది నమ్మదగిన విషయంగా లేదే! అధికారుల బోధనయా? కాక మదిలో లేకుండానే పెదాలు కదిలి ఉచ్ఛరించారా? అనేది వీడని అనుమానంగానే ఉంది.
గ్రీన్ జోన్, ఆరంజ్ జోన్లలోనే కాదు, అత్యంత ప్రమాదభరితమైన రెడ్ జోన్లలో సైతం మధువు సీసా మూతలు తీసి అమ్మకాలకు ఆజ్ఞ వేశారు. ఆ ఉత్తర్వులను పరికిస్తే కేసిఆర్ కు భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లిపోయిందా? అనిపిస్తుంది.
కనీసం రెడ్ జోన్లలోనైనా మధుశాల కంటే ముందు మాధవుని ఆలయాలు తెరిపిస్తాడని పేద పూజారులు, దైవభక్తులు రాత్రి 11 గంటల వరకూ టీవీ ముందు కూర్చొని చివరాఖరికి నిట్టూర్పులు విడిచి నిద్రకొరిగారు.
6వ తేదీ నృసింహ జయంతిని పురస్కరించుకుని దేవాలయాల సందర్శనకు భక్తులకు అవకాశం కల్పిస్తారని ఆశించారు.
యాదాద్రి లక్ష్మీ నృసింహ స్వామి ఆలయాన్ని అధ్బుతంగా తీర్చి దిద్దిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న తరుణంలో, నిన్నటి రోజు కేసీఆర్ నిర్ణయాన్ని ఆలయ సందర్శకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
సురాపాన ప్రియులకున్న ప్రాధాన్యత, ఈ కరోనా దుస్థితిలో దైవాన్ని ఆరాధించే సామాన్య ప్రజలకు లేదని ముఖ్యమంత్రి ఆదేశాలను పరికిస్తే స్పష్టంగా కనపడుతుంది.
ఒక పూజారి నడిబజారులో వాహకుల వద్ద అర్థిస్తుంటే ,తన మంత్రి వర్గ సభ్యుడొకరు ఇటీవల ఆదుకున్న విషయాన్ని కేసీఆర్ మరిచారనిపిస్తుంది. ఆ సంఘటన పూజారులు పడుతున్న ఆర్థిక వ్యధలకు అద్దం పడుతుంది.
మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆదాయ మార్గాలే కావచ్చు, కాదనడం లేదు. కానీ రెడ్ జోన్లలో సైతం వైన్ దుకాణాలు తెరవడంవల్ల ఆదాయం సంగతి పక్కన పెడితే కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని జమ కూడతాయో కూడా సలహాదారులు అంచనా వేయాలి. లేకపోతే 40 రోజుల లాకడౌన్ (విశ్వామిత్ర) తపస్సు… సురాపానం మత్తులో
కరోనా క్రిమి వల్ల ఎన్ని ‘శకుంతల’లుగా ఉద్భవిస్తాయో? వేచిచూద్దాం.
✍️ ఎం. మారుతీ ప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్.