ఔనా…? తెలంగాణా సీఎం కేసీఆర్ మళ్లీ యాగం చేశారా? చేస్తే అది ఏ టైపు యాగం? అయినా యాగాలు చేయాలని కేసీఆర్ తల్చుకుంటే రహస్యంగా చేయాల్సిన అగత్యమేంటి? తెలంగాణా మాండలికంలోనే చెప్పాలంటే ‘బాజాప్తా’గా, బహిరంగంగానే ఆయన యాగం చేసే వీలుంది. యాగాల నిర్వహణ ఆయనకు కొత్తమే కాదు కూడా. కానీ బీజేపీ బండి సంజయ్ ఏమంటున్నారు?
తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయడానికి కేసీఆర్ మూడు రోజులపాటు దోష నివారణ పూజలు చేశారుట. ఆ పూజల ద్రవ్యాలను త్రివేణీ సంగమంలో కలిపేందుకే కాళేశ్వరం వెళ్లారనేది బీజేపీ సంజయ్ భాష్యం. ఇదే దశలో కాషాయ రంగు పులుముకున్న బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన పత్రిక ఏమంటున్నది?
మకరం సంక్రమించే సమయంలో సీఎం కేసీఆర్ తన ఫాంహౌజ్ లో హోమం నిర్వహించారనే ప్రచారం సాగుతోందన్నది వివేక్ పత్రిక తాజా కథనం. భోగి, సంక్రాంతి రోజు ఈ హోమ తంతును పూర్తి చేసేందుకు 15 మంది రుత్వికులు వచ్చినట్లు కూడా టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారట. ఏదేని కొత్త కార్యక్రమం చేపట్టే ముందు హోమాలు చేయడం కేసీఆర్ కు అలవాటని, ఇందులో భాగంగానే తన కుమారున్ని సీఎంగా పట్టాభిషిక్తున్ని చేసేందుకు ప్రత్యేక పూజలు చేసి ఉంటారని కూడా వివేక్ పత్రిక నివేదించింది.
బీజేపీ బండి సంజయ్ వ్యాఖ్యలు, వివేక్ పత్రిక వార్తా కథనం సంగతి ఎలా ఉన్నప్పటికీ, నిజంగా కేసీఆర్ తన కుమారుడి పట్టాభిషేకం కోసం ఏదేని యాగాన్ని నిర్వహించారా? అదే జరిగితే ఆ యాగం పేరేమిటి? ఇదీ తాజా చర్చ. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం అది ఏ రాజశ్యామల యాగం మాత్రం కాదనేది ప్రముఖ సిద్ధాంతుల వాదన. కేసీఆర్ యాగం చేయడం నిజమే అయితే అది ఖచ్చితంగా ‘చండీ యాగం’ మాత్రమే కావచ్చనేది వారి అభిప్రాయం.
ప్రముఖ బ్రాహ్మణోత్తముల కథనం ప్రకారం… ఏదేని ముఖ్య కార్యం నిర్వహించేముందు అనేక మంది ‘చండీ యాగం’ నిర్వహిస్తుంటారు. విజయ స్వరూపిణిగా, శక్తిగా చండీని కొలుస్తారు. చేపట్టనున్న ముఖ్య కార్యానికి అవసరమైన శక్తిని ప్రసాదించాలని వేడుకోవడమే ఈ చండీయాగం ప్రాముఖ్యతలోని అసలు విశిష్టత.
కాళేశ్వరంలో సీఎం కేసీఆర్ ఆరాధించే ‘శుభానందదేవి’ దేవాలయం కూడా ఉండడం విశేషం. చేపట్టే కార్యంలో శుభానందదేవి ఆశీస్సులు ఉండాలని, ఆమె అనుగ్రహానికి తిరుగే లేదని భక్తులు విశ్వసిస్తుంటారు. దాదాపు రూ. 37.00 లక్షల వ్యయంతో బంగారు కిరీటాన్ని కూడా కేసీఆర్ తయారు చేయించి శుభానందదేవికి అలంకరించారు. అంతేగాక రూ. 2.00 లక్షల విలువైన పట్టుచీరను కూడా అమ్మవారికి సీఎం కేసీఆర్ సమర్పించారు. అయితే ఈ పట్టుచీర చోరీకి గురై ఇప్పటికీ తిరిగి లభించలేదనేది వేరే విషయం. తన కాళేశ్వరం పర్యటనలో శుభానందదేవిని కేసీఆర్ దర్శించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన, కేటీఆర్ కు సీఎంగా పట్టాభిషేకం, బీజేపీ సంజయ్ తాజా వ్యాఖ్యలు తదితర అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ఫీచర్డ్ ఇమేజ్: ఫైల్ ఫొటో