ఈ ఫొటోలోని వ్యక్తి పేరు సాదుల రాంబాబు… ఇతన్ని టోపీ రాంబాబు అని కూడా పిలుస్తుంటారు. తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నివాసి. దివ్యాంగుడు కూడా. టీఆర్ఎస్ పార్టీ అంటే బట్టలు చింపుకుంటాడు. కేసీఆర్ పేరు వింటేనే పులకరించిపోతాడు. నఖశిఖ పర్యంతం పరిశీలించినా గులాబీ వస్త్ర ధారణలోనే మనకు సాక్షాత్కరిస్తుంటాడు. తన దిన చర్య యావత్తూ గులాబీ జెండా రెపరెపల పలవరింతే. అంతెందుకు కేసీఆర్ సర్కార్ ఇచ్చే రూ. 3 వేల దివ్యాంగుల పెన్షన్ ను పొందుతున్న సాదుల రాంబాబు ఆ డబ్బును ఎందుకు ఖర్చు చేస్తాడో తెలుసా? గులాబీ కలర్ డ్రెస్సుల కోసమే. టీఆర్ఎస్ పార్టీ నేతల ఫ్లెక్సీల కోసమే. పింక్ రంగు టోపీల కోసమే. తనకు వచ్చే దివ్యాంగుడి పెన్షన్ డబ్బుతోనే తనకు తారసపడిన వారికి రాంబాబు చాయ్ తాగిస్తాడే తప్ప, ఎవరినీ చేయి చాచి రూపాయి యాచించడు.
కానీ తన జీవితాశయం ఒకటి ఉంది. చివరి కోరిక తీర్చుకోవాలనే తపనతోనే అనారోగ్యంలోనూ పదే పదే అదే పదాన్ని కలవరిస్తున్నాడు.. పలవరిస్తున్నాడు. కనిపించిన ప్రతి నాయకున్నీ, కార్యకర్తలను బతిలాడుతున్నాడు. దినసరి కనీసం ఓ వంద మందికైనా ఫోన్ కాల్స్ చేస్తున్నాడు. దాదాపుగా ఇరవై ఏళ్లుగా ఇదే తపన. అంటే టీఆర్ఎస్ ఆవిర్భవించిన 2001 సంవత్సరం నుంచి రాంబాబు కోరికలో ఎటువంటి మార్పు లేకపోవడమే విశేషం. నిద్ర లేచింది తడవుగా తన కోరికను తీర్చే నాయకుడు ఈరోజైనా దొరక్కపోతాడా? అని హుజూరాబాద్ చౌరస్తాలో నిలబడి మరీ ఎదురు చూస్తున్నాడు. ఇంతకీ రాంబాబు ఆశించేది ఏమిటనేగా మీ సందేహం?
మణులూ… మాణిక్యాలు కావు. వజ్ర, వైఢూర్యాలు అంతకన్నా కావు. కార్పొరేషన్ చైర్మెన్ గిరి కానే కాదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్టూ ఆశించడం లేదు. 2001 నుంచి తాను పార్టీ పతాకాన్ని మోస్తున్నాడు కాబట్టి గులాబీ జెండా ఓనర్ గా క్లెయిమ్ చేసుకోవడం లేదు. కానీ ఓ చిన్న కోరికను వెలిబుచ్చుతున్నాడు. అది కేసీఆర్ తో కరచాలనం. ఔను.. గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ సార్ చేతి స్పర్శను ‘షేక్ హ్యాండ్’గా స్వీకరించి తన జన్మ తరించాలన్నది రాంబాబు జీవిత కోరిక. అది కూడా ఎంతోసేపు కాదు. రెండంటే రెండే సెకన్లు కేసీఆర్ సార్ తో కరచాలనం చేసి టోపీని బహుకరించాలనేది రాంబాబు కాంక్ష.
ఇందుకోసం గడచిన రెండు దశాబ్దాలుగా రాంబాబు చేయని ప్రయత్నం లేదు. కలవని అధికార పార్టీ నాయకుడూ లేడు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఈటెల రాజేందర్ ల నుంచి గల్లీ స్థాయి లీడర్ వరకు… కలసిన ప్రతి టీఆర్ఎస్ పార్టీ నాయకుడి ముందు రాంబాబు వెలిబుచ్చే కోరిక ఒక్కటే. తనను ఓసారి కేసీఆర్ సార్ వద్దకు తీసుకువెళ్లాలని. కానీ ఏ నాయకుడూ రాంబాబు కోరికను తీర్చేందుకు సాహసించడం లేదు. ఎందుకంటే మంత్రులు, ఎమ్మెల్యేలకే కేసీఆర్ సార్ అపాయింట్మెంట్ దొరకడం లేదనే ప్రచారం ఉండనే ఉంది కదా? అందుకే రాంబాబును చివరి కోరికను తీర్చాలనే తపన ఉన్న నేతలు కూడా అందుకు సాహసించడం లేదట.
కానీ రాంబాబు తన ఆశను మాత్రం చంపుకోవడం లేదు. అనారోగ్యంతో రోజు రోజుకూ మృత్యువుకు దగ్గరవుతున్నా, దివ్వాంగుడి పెన్షన్ డబ్బుతోనే కేసీఆర్ సార్ 66వ బర్త్ డే సందర్భంగా హుజూరాబాద్ లో ఎలా ఫ్లెక్సీ కట్టాడో చూడండి. ఒక్క కేసీఆర్ సార్ కే కాదట… పార్టీ కార్యక్రమం ఏది జరిగినా, కరీంనగర్ జిల్లాలో ఏ పెద్ద నాయకుడి పర్యటన జరిగినా ఇలాగే తన పెన్షన్ డబ్బుతోనే ఫ్లెక్సీలు కడుతుంటాడట. ఏదో ఒక రోజు… ఎవరో ఒక గులాబీ పార్టీ నేత తనను కేసీఆర్ సార్ వద్దకు తీసుకువెళ్లి తన చివరి కోరికను తీర్చకపోతారా? అని రాంబాబు హుజూరాబాద్ చౌరాస్తాలో ఎదురుచూస్తూనే ఉన్నాడు…. చిన్న నాటి స్నేహితులు కనిపిస్తే పులకరించి, పలకరించి తన స్నేహ బాంధవ్యాన్ని చాటుకుంటున్న కేసీఆర్ ఈ గులాబీ పార్టీ బంటు సాదుల రాంబాబు జీవిత చరమాంకపు కోరికను తన బర్త్ డే సందర్భంగానైనా తీర్చాలని ఆకాంక్షిద్దాం.
రాంబాబు తన చివరి కోరికను వెలిబుచ్చుతున్న తీరును దిగువన వీడియోలో చూడండి.