అంచనా వేసినట్టే జరిగింది. ఊహించిన పరిణాామమే చోటు చేసుకుంది. తెలంగాణాలోనూ మద్యం విక్రయాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తెలంగాణా వ్యాప్తంగా కంటైన్మెంట్ ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని ఏరియాల్లో బుధవారం నుంచి మద్యం షాపులు తెరవనున్నట్లు సీఎం ప్రకటించారు. లాక్ డౌన్ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులకు అనుగుణంగా, ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో లిక్కర్ షాపులు తెరిచిన నేపథ్యంలో తెలంగాణాలో మద్యం షాపులను తెరవడానికి అనుమతి ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ మంగళవారం పొద్దు పోయాక ప్రకటించారు.
దాదాపు ఏడున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం అనంతరం రాత్రి పది గంటల ప్రాంతంలో సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం షాపులను ఓపెన్ చేస్తున్నట్లు రాత్రి 11 గంటల ప్రాంతంలో సీఎం తన మీడియా సమావేశంలో ప్రకటించారు. సగటున మద్యం ధరలను 16 శాతం పెంచనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో వ్యవసాయ, నిర్మాణ రంగాలకు సంబంధించిన షాపులు తెరిచి ఉంటాయన్నారు. రాత్రి పూట మాత్రం యథా విధిగా కర్ఫ్యూ ఖచ్చితంగా, కఠినంగా అమలు చేస్తామన్నారు.