– త్వరలో నాలుగు విప్లవాలు
– కాస్త నయం: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం
– 10 జిల్లాలు భద్రం: మూడు జిల్లాల్లో కేసులే లేవు, 7 జిల్లాల్లో వచ్చి తగ్గాయి
– తెలంగాణా బువ్వ!
– శుభ శకునం: త్వరలో కరోనా రహిత రాష్ట్రం, వైరస్ వ్యాప్తి తగ్గుముఖం
– హమ్మయ్య! రెండే కేసులు
– కేసీఆర్ సూచనలు అభినందనీయం
గడచిన వారం రోజుల్లో ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణా మెయిన్ ఎడిషన్లో వచ్చిన వార్తలకు సంబంధించిన శీర్షికలివి. ఆయా శీర్షికల్లో ఒకటి మంత్రి కేటీఆర్ ఇంటర్వ్యూ కాగా, మిగతావన్నీ వివిధ అంశాలకు సంబంధించినవి. పత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించిన వార్తా కథనాలకు సంబంధించిన హెడ్డింగులివి. అయితే ఏమిటట… అంటే…? అక్కడే ఉంది అసలు విశేష వార్తాంశం.
కరోనా నేపథ్యంలో ‘వైద్యులకేదీ రక్షణ’ శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఓ వార్తా కథనంపై తెలంగాణా సీఎం కేసీఆర్ గత నెల 6వ తేదీన తీవ్ర స్థాయిలో ఆగ్రహించిన సంగతి తెలిసిందే. ‘కేసీఆర్ చెప్పిండంటే ఖతర్నాక్ ఉంటది. సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటాం. సర్కార్ దేన్నీ చూడడం లేదని అనుకోవద్దు’ అంటూ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే పేరును ప్రస్తావించకుండానే ఆయనకు పరోక్ష హెచ్చరిక చేశారు. ఇటువంటి రాతలు రాసేవారికి కరోనా సోకాలని కూడా సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
తన పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్కే కూడా తీవ్రంగానే స్పందించారు. ‘కేసీఆర్ ఆంధ్రజ్యోతిని శిక్షిస్తానంటే ఇక్కడ భయపడేవారెవరు? కేసీఆర్ అనే ఆధునిక నిజాం ప్రభువుకు అందరూ గులాంగిరీ చేయాల్సిందేనా? అంతా నాకే తెలుసనే అహంకారంతో విర్రవీగితే ఎలాంటి పరిస్థితి వస్తుంది? కేసీఆర్ నైజంపై ప్రొఫెసర్ జయశంకర్ గతంలో ఎటువంటి విశ్లేషణ చేశారు?’ అనే ప్రశ్నలు ప్రామాణికంగా గత నెల 12వ తేదీన ఆర్కే తన ‘కొత్తపలుకు కాలమ్’లో విరుచుకుపడ్డారు.
ఆయా పరిణామాల నేపథ్యంలోనే గత నెల 24వ తేదీ నుంచి ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమవుతున్న సర్కారు సానుకూల శీర్షికలు తెలంగాణా వ్యాప్తగా వివిధ వర్గాల్లో, ముఖ్యంగా మీడియా సర్కిళ్లలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకున్నట్లు ప్రచారంలో గల ఓ సంఘటన సీఎం కేసీఆర్, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణల మధ్య పూర్వ స్నేహాన్ని మళ్లీ అతికించిందనేది ఆయా ప్రచారపు సారాంశం. అయితే ఆ ముఖ్య సంఘటన ఏమిటి? అందుకు దారి తీసిన ప్రత్యేక పరిస్థితులు, పరిణామాలు ఏమిటి? వంటి ప్రశ్నలకు మాత్రం ధృవపడిన సమాచారం లేదు.
కానీ ఆంధ్రజ్యోతి రాతల వైఖరి, తీరు మారిందనేది మాత్రం సుస్పష్టం. అందుకు ఆయా శీర్షికలే నిదర్శనమన్నది పలువురి వాదన. ఏది ఏమైతేనేం…? తాజా సమాచారం ప్రకారం కేసీఆర్, ఆర్కే భాయీ… భాయీ అనేది ఓ కథనం. అందులో భాగమే ఆర్కే పత్రికలో కేసీఆర్ సర్కార్ సానుకూల శీర్షికలుగా జర్నలిస్టు వర్గాలు అభివర్ణిస్తున్నాయి. అందువల్ల ఇక నుంచి తెలంగాణాలోని తెలుగు ప్రింట్ మీడియాలోని ప్రముఖ పత్రికల్లో అన్నీ సర్కార్ పాజిటివ్ వార్తలే చదువుకోవచ్చు. నో… నెగిటివ్ న్యూస్ అన్నమాట. అందుకే కేసీఆర్ చెప్పిండంటే ఖతర్నాక్ ఉంటది. ఆ విషయం తెలియాలంటే కొందరికి కాస్త టైం పడుతుంది. అంతే…