సమయం, సందర్బం వచ్చినపుడే కదా… సర్కారు తమ ప్రచార కండూతి తీవ్రతను పెంచాల్సింది. పత్రికల్లో, టీవీల్లో తమ సర్కారు ఘనతను చాటుతూ పేజీలకు పేజీలు అడ్వర్టయిజ్మెంట్లు కుమ్మాల్సింది? జాకెట్ యాడ్స్ పేరుతో పత్రికల మెయిన్ ఎడిషన్ ‘మాస్ట్ హెడ్‘ (టైటిల్) మినహా మరేమీ కనిపించకుండా సంక్షేమ ఫలాల గురించి ఊదరగొట్టాల్సింది? మరి తెలంగాణాలో కేసీఆర్ సార్ ఆరేళ్ల పాలన గురించి సమాచార, పౌరసంబంధాల శాఖ తరపున ఈసారి సింగిల్ సెంటీమీటర్ యాడ్ కూడా పత్రికల్లో పబ్లిష్ కాలేదేమిటి? టీవీల్లో అదేపనిగా యాడ్స్ టెలీకాస్ట్ కాలేదేమిటి? అదీ అసలు ఆసక్తికర అంశం.
కేవలం ఏడాది పాలనకే పొరుగున గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీభత్సమైన రీతిలో ‘డబుల్ జాకెట్’ యాడ్స్ కుమ్మేస్తోంది కదా? కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రజలకు సమాచారం చేరవేస్తూ పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తోంది కదా? తెలంగాణా సీఎం కేసీఆర్ సార్ కు ఇటువంటి ప్రచారపు కీర్తి, కండూతి గురించి మొహం మొత్తిందా ఏంటి? లేక ఇక మనకెందుకులే పబ్లిసిటీ అని భావించారా? ఇవీ తాజా సంశయాలు.
ఇక అసలు విషయంలోకి వెడదాం. ప్రభుత్వ పథకాల ప్రచారపు అంశానికి సంబంధించి ఏ నాయకుడికీ ప్రచారపు యావ తగ్గకపోవచ్చు. అనేక మంది సీఎంల హయాంలో రుజువైన సత్యం కూడా ఇదే. తెలంగాణా సీఎం అందుకు అతీతం కాకపోవచ్చు కూడా. అందుకే కాబోలు రైతు బంధు పథకం ప్రారంభం సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం జాతీయ స్థాయిలో పత్రికల్లో పేజీలకు పేజీలు యాడ్స్ విడుదల చేసింది. ఒడియా, బెంగాలీ అనే భాషా భేదం లేకుండా దేశ వ్యాప్తంగా అనేక పత్రిలకు స్థానిక భాషలోనే యాడ్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. తద్వారా కోటాను కోట్ల రూపాయలను కేవలం ప్రచారం కోసమే అప్పట్లో తెలంగాణా ప్రభుత్వం ఖర్చు చేసింది.
అయితే తెలంగాణాలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా, మొత్తంగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న శుభ సమయాన, నిన్న జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం నేపథ్యంలో ఏ పత్రికకుగాని, మరే న్యూస్ చానల్ కు గాని సింగిల్ సెంటీమీటర్ యాడ్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడం గమనార్హం. అయినప్పటికీ అటు ప్రముఖ పత్రికలు, ఇటు న్యూస్ ఛానల్స్ కేసీఆర్ ఆరేళ్ల పాలనపై భారీ ఎత్తున పాజిటివ్ కథనాలనే వెలువరించడం విశేషం. ఈ అంశంలో అధికార పత్రికను మినహాయించినా, ప్రముఖ పత్రికలు కూడా పేజీలకు పేజీలు కేటాయిస్తూ కేసీఆర్ పాలన గురించి సానుకూల వార్తా కథనాలను ప్రచురించడం ఆసక్తికర అంశం.
ఇంతకీ కేసీఆర్ సర్కార్ మీడియాకు ఈసారి యాడ్స్ ఎందుకివ్వలేదంటే…? కరోనా కల్లోల పరిణామాల్లో కొన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులకే వేతనాల్లో కోత కోస్తున్న సంగతి తెలిసిందే కదా? లాక్ డౌన్ కారణంగా ఖజానా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమట. అయినా ప్రముఖ పత్రికలు కేసీఆర్ ప్రభుత్వంపై ఏ మాత్రం అలక వహించకుండా భారీగానే కీర్తించాయి కదా? ఏంటీ మతలబు అనే సందేహం కలుగుతోందా? దటీజ్ కేసీఆర్ సార్… ఆరేళ్ల పాలన తెచ్చిన అనుభవం. కేవలం పత్రికల విషయంలోనే కాదు, మొత్తంగా మీడియా అంశంలో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో సీఎం సార్ కు గట్టి పట్టు లభించిందనే ప్రచారం ఎలాగూ ఉంది. ఫలితంగానే ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ వైఖరి వల్ల ఖజానాకు కోటాను కోట్ల రూపాయల ప్రజాధనం పొదుపు. ప్రచారపు ఖర్చు పూర్తిగా అదుపు. మొత్తంగా మీడియా భారీ కీర్తన వల్ల ‘కేసీఆర్’కు పబ్లిసీటీ పరంగా చేవ… ప్రభుత్వ ఖజానాకు రూ. కోట్ల మేర రొక్కం మిగులుబాటు’… అదీ సంగతి.