తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మరోసారి భేటీ కానున్నారు. ఈనెల 13న తెలంగాణా, ఏపీ సీఎంల భేటీ జరగడం ఇది తొలిసారీ కాదు, చివరిదీ కాకపోవచ్చు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీపై అనేక వార్తా సంస్థలు, వెబ్ సైట్లు రకరకాల వార్తా కథనాలను కూడా ప్రచురించాయి. విభజన చట్టం, దీర్ఘకాలికంగా పెండింగ్ లో గల సమస్యలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందన్నది ఆయా వార్తల సారాంశం. అంతేకాదు విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యలు, శ్రీశైలానికి గోదావరి నీళ్ల తరలింపు వంటి అంశాలను ప్రధానంగా చర్చించవచ్చని ఆయా వార్తల్లో ఉటంకించారు. అమరావతి రాజధాని అంశంపై ఏపీలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేసీఆర్, జగన్ ల భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడినట్లు కూడా మరికొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

కానీ ఈ వార్త రాస్తున్న సమయానికి ఈ ఇద్దరు సీఎంల భేటీ ఎక్కడ జరుగుతుందనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వెలువడినట్లు లేదు. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం తెలంగాణాలో జరిగే సమాచారం అధికారికమే అయినప్పటికీ, వేదిక ఎక్కడ అన్నదే ఖరారు కాకపోవడం విశేషం. కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ లోనా? లేక ఎర్రవెల్లిలోని ఫాం హౌజ్ లో వీరిద్దరి భేటీ జరుగుతుందా? అనే అంశంపై స్పష్టత రావలసి ఉంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా భోగీ పండుగకు ఒక రోజు ముందు ఈ ఇద్దరు సీఎం భేటీ జరుగుతుండడమే ఇందుకు కారణం. సరే సమావేశపు స్థలం ఏదైనప్పటికీ అక్కడ వీరిద్దరు చర్చించబోయే అంశాలపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ భేటీలో మూడు ప్రధాన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అందులో మొదటిది అమరావతి రాజధాని అంశం గురించే కావచ్చు. ఈ విషయంలో సుదీర్ఘ రాజకీయానుభవం గల కేసీఆర్ సలహాలను జగన్ తీసుకునే అవకాశాన్ని రాజకీయ పరిశీలకులు తోసి పుచ్చలేకపోతున్నారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికలు, హైపవర్ కమిటీ అధ్యయనపు రిపోర్ట్, అమరావతిలో కొనసాగుతున్న ఆందోళనలు, తదుపరి కార్యాచరణ వంటి అంశాలపై జగన్ కేసీఆర్ తో కూలంకషంగా చర్చించే అవకాశాలున్నాయి. ఫైనల్ గా రాజధాని అంశంలో కేసీఆర్ ఇచ్చే సూచనలు, సలహాలను జగన్ స్వీకరించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

ఫైల్ ఫొటో

అదేవిధంగా జాతీయ రాజకీయాలపైనా లోతైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఎన్ఆర్సీ, క్యాబ్ తదితర తాజా అంశాలు, జాతీయ స్థాయిలో అనుసరించే విధానాల గురించి కూడా ఇద్దరు సీఎంల మధ్య చర్చ జరగవచ్చని సమాచారం. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు విధానాలపై ఐక్యంగా ఉండడమా? పరిస్థితులను బట్టి వ్యవహరించడమా? ఆత్మాభిమానం చంపుకోకుండా నిర్ణయాలు  తీసుకోవడం వంటి అంశాలపై ఇద్దరు సీఎంల మద్య సుదీర్ఘ చర్చ జరగవచ్చని తెలుస్తోంది. మరోవైపు అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు జగన్ హాజరు కావలసిందేనని ఇటీవల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే, నిందితునిగా ఉన్న కేసుల్లో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావలసిందేనని సీబీఐ కోర్టు తేల్చినట్లు వార్తలు వచ్చిన విషయం కూడా విదితమే. ఇందుకు సంబంధించి కూడా న్యాయపరంగా అనుసరించాల్సిన సలహాలను జగన్ కేసీఆర్ నుంచి కోరే అవకాశం లేకపోలేదంటున్నారు.

ఇకపోతే మరో ముఖ్య విషయం గురించి కూడా ఇద్దరు సీఎంల మధ్య చర్చ జరిగే అవకాశమున్నట్లు సమాచారం. తన తనయుడు కేటీఆర్ కు సీఎంగా కేసీఆర్ పట్టాభిషేకం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో జగన్ నుంచి లభించాల్సిన స్నేహపూర్వక సహకారం గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేటీఆర్ సీఎం అయ్యాక అన్నదమ్ముల్లా ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాలని కేసీఆర్ జగన్ ను కోరే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు యువ నేతలు తెలుగు రాష్ట్రాల సీఎంలుగా కలిసి ఉంటే ‘పెద నాన్న’ తరహాలో తాను వ్యవహరిస్తానని కేసీఆర్ జగన్ కు స్పష్టం చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా అమరావతి రాజధాని-తాజా పరిణామాలు, జాతీయ రాజకీయాలు-అనుసరించాల్సిన విధానం, కేటీఆర్ కు పట్టాభిషేకం-తదనంతర స్నేహ బంధం గురించే ఎక్కువగా చర్చ జరగవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. ముఖ్యంగా ఈ మూడు అంశాలకే తెలుగు రాష్ట్రాల సీఏం ల భేటీలో అత్యంత ప్రాధాన్యత ఉండవచ్చన్నది అసలు సారాంశం.

Comments are closed.

Exit mobile version