తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాంతంగా భేటీ అయ్యారు. అయితే ఏంటి? అనుకోకండి. ఈ ఇద్దరు సీఎంలు కలుసుకోవడం ఇది తొలిసారి కాదు. చివరి సారి కూడా కాకపోవచ్చు. కానీ వీరిద్దరూ గతంలో కలుసుకున్న తీరు వేరు. ప్రస్తుత భేటీ వేరు. అదే అసలు విశేషంగా అభివర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యాక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీరులోనే మార్పు రావడం తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి రాజకీయ పరిణామాలు, జగన్ సీఎం అయ్యాక మారిన పొలిటికల్ సీన్ గురించి కొత్తగా చెప్పకునేది కూడా ఏమీ లేదు.
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకుని అనేక అంశాలపై మాట్లాడుకోవడం ఇది నాలుగోసారి. విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు తదితర అంశాలు తాజా భేటీలో ప్రస్తావనకు వస్తాయన్నది వార్తా కథనాల సారాంశం. ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగులు, డీఎస్పీల విభజన, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదలాయింపు తదితర అంశాలపై చర్చిస్తారని, గతంలో జరిగిన మూడు సమావేశాల్లో తీసుకున్ననిర్ణయాల అమలు తీరును సమీక్షిస్తారనే వార్తలు వెలువడ్డాయి.
మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రగతి భవన్ చేరుకున్న ఏపీ సీఎం దాదాపు నాలుగు గంటలుగా తెలంగాణా సీఎంతో ఏకాంత చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ వార్త రాసే సమయానికి మరో గంటసేపటి వరకు ఇద్దరు సీఎం భేటీ జరగవచ్చనేది ఖచ్చితమైన సమాచారం. సాధారణంగా రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారంటే ఆయా రాష్ట్రాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలే చర్చకు వస్తాయి. ఇందుకోసం ఐఎఎస్, ఐపీఎస్ వంటి అధికారులు సీఎంల వెంట సమావేశంలో పాల్గొంటారు. ఎజెండాలోని అంశాలకు సంబంధించి అవసరమైన ఫైళ్లను చేతబట్టుకుని మరీ బ్యూరోక్రాట్లు హాజరవుతారు.
కానీ ప్రస్తుతం జరుగుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ఎటువంటి బ్యూరోక్రాట్లు లేకపోవడం గమనార్హం. అధికారులు లేకుండా గంటలు, గంటలుగా సాగుతున్న ఇద్దరు సీఎంల ఏకాంత భేటీ వ్యక్తిగత ప్రాముఖ్యతను ప్రస్ఫుటింప జేస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఎటువంటి వివాదాలుగాని, పంచాయతీలుగాని లేవని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులను దూరంగా ఉంచి జరుగుతున్న ఏకాంత భేటీలో రాజకీయ కోణం దాగి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమరావతి రాజధాని మూడు ముక్కల అంశం, అక్కడ నెలకొన్న ఆందోళనలు, జరుగుతున్నపోరాటాలు, తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం, త్వరలో కేటీఆర్ పట్టాభిషేకం వంటి వార్తల నేపథ్యంలో కేసీఆర్, జగన్ ల ఏకాంత కలయిక రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీయడం విశేషం.