సీఎం కేసీఆర్ కు తెలంగాణా ఉద్యమకారుని అభ్యర్థన
సుదీర్ఘకాలం పాటు అజేయంగా, అప్రతిహతంగా ఉండాల్సిన కేసీఆర్ చెరిష్మా రోజురోజుకూ తగ్గిపోతుండటానికి ఉన్న సవాలక్ష కారణాలలో కొన్నిటినైనా ఆయన అవలోకనం చేసుకునే కనీస ప్రయత్నం కూడా చేసుకోపోవటం వింతగాఉంది. ఈ రోజు మరొకటో, రెండో ….. మొత్తం ప్రభుత్వ శాఖల్లో ఆకాశమంత ఎత్తుకు పెరిగిన అవినీతి. ఏ మాత్రం భయం లేకుండా ఉద్యోగులు బాహాటంగానే లంచాలు తీసుకుంటున్నారు. ప్రజల ఏ చిన్న సమస్య పరిష్కారం కావాలన్నా ఉద్యోగుల జేబులు నింపాల్సిన స్థితి ఉంది. వాళ్ళకి లంచాలు ఇవ్వకపోతే తమ సమస్య తీరకపోగా కొత్త సమస్యల్లో ఇరుక్కుపోవాల్సి వస్తుందని ప్రజలు భయపడే స్థితికి వచ్చారు.
అవినీతి లేని తెలంగాణ నా లక్ష్యం అని చెప్పే కేసీఆర్ పాలన అవినీతి ప్రగతిలో ఉండటం శోచనీయంగా మారింది . ఇక మాట్లాడితే ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చొని పనిచేయిస్తా.., తల నరుక్కుంటా… అనే డైలాగులు వినీవినీ ప్రజలు అవహేళనగా నవ్వుకునే దశకు కేసీఆర్ స్వయంగా తీసుకు వచ్చారు. శాసనసభ్యులకు కూడా దర్శనం దొరకని స్థాయిలో వ్యవహరించటం పట్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. కొందరు గుత్తేదారులు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నా పట్టించుకోకుండా, వారిపై విచారణ జరిపించకుండా తిరిగి వారికే కాంట్రాక్టులు ఒప్పచెప్పటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
తెలంగాణా రాష్ట్ర సాధన కొరకు శ్రమించిన త్యాగాలు చేసిన లక్షలాది మందిలో కొందరు ముఖ్యుల్లో ఆయన ఒకరు మాత్రమే. అది మర్చిపోయి కేవలం తనవల్లనే తెలంగాణ సిద్దించింది అని ప్రకటించుకోవటాన్ని ప్రజలు తేలిగ్గా తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో కనీస గౌరవం లభించని ఉద్యమకారుల గురించి సానుభూతిగా ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంకా తెలంగాణ ఉద్వేగాలు సజీవంగా ఉండటం వల్ల, కేసీఆర్ గారికి ప్రత్యమ్నాయ నేత దొరకకపోవడంతో ప్రజలు గుంభనంగా ఉన్నారు, సహిస్తున్నారు. ఆయనలో మంచి మార్పు రావాలనే ప్రజలు కోరుతున్నారు. అది రాకపోతే కేసీఆర్ స్వయంకృతాపరాధమే..!! తొలిదశ నుండి మలిదశ ఉద్యమకారుడిగా, ఆయన మేలు కోసం ఇది నా వ్యక్తీకరణ.
✍️ అర్వపల్లి విద్యాసాగర్, ఖమ్మం
(ఫేస్ బుక్ పేజీ నుంచి స్వీకరణ)