తెలంగాణాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. అటు హైదరాబాద్, ఇటు నల్లగొండ స్థానాల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో అధికార పార్టీ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఫలితాల్లో ఇదే ‘ట్రెండ్’ కొనసాగితే తొలి ప్రాధాన్యతలోనే ఆధిక్యతలో గల అభ్యర్థులు గెలిచే అవకాశలు కష్టమేనంటున్నారు. ఇప్పటి వరకు రెండు రౌండ్లలో తొలి ప్రాధాన్యత లెక్కింపు ఫలితాలు వెలువడిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం ఫలితాల సరళిని విశ్లేషిస్తే ఇదే అంశం బోధపడుతుంది.

ఈ స్థానంలో మొత్తం 3.86 లక్షల ఓట్లు పోలు కాగా, ఇప్పటి వరకు రెండు రౌండ్ల ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తొలి రౌండ్ లో 16,130 ఓట్లను, రెండో రౌండ్ లో 15,857 ఓట్లను సాధించారు. సగటున ప్రతి రౌండ్ కు 15 వేల ఓట్లను రాజేశ్వర్ రెడ్డి కైవసం చేసుకున్నా ఏడు రౌండ్లలో ఆయనకు లభించే ఓట్ల సంఖ్య లక్షా 5 వేలు మాత్రమే. లెక్కింపు జరగాల్సిన మరో ఐదు రౌండ్లలో రాజేశ్వర్ రెడ్డికి మరిన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉందని భావించినప్పుడు, సగటున ప్రతి రౌండ్ కు 20 వేల ఓట్ల చొప్పున దక్కించుకున్నా మొత్తంగా ఆయనకు లభించేంది లక్షా 40 వేల ఓట్లు మాత్రమే. మొత్తం పోలైనవాటిలో చెల్లుబాటయ్యే ఓట్లలో 51 శాతం లభించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

ఈ ప్రాతిపదికన మొత్తం 3.86 లక్షల ఓట్లు పోలు కాగా, తొలి రౌండ్ లో 3,787, రెండో రౌండ్ లో 3,009 ఓట్లు చెల్లకుండాపోయాయి. ఈ లెక్కన సగటున ప్రతి రౌండ్ కు 3 వేల ఓట్ల చొప్పున చెల్లని ఓట్లుగా అంచనా వేసినా, ఏడు రౌండ్లలో 21 వేలు ఓట్లు చెల్లనివిగా తేలే అవకాశం ఉంది. పోలైన 3 లక్షల 86 వేల ఓట్లలో గరిష్టంగా 26 వేల ఓట్లు చెల్లకుండాపోయినా, మిగిలిన 3.60 లక్షల ఓట్లలో 51 శాతం ఓట్లు లభిస్తే తప్ప ఆధిక్యంలో గల అభ్యర్థి తొలిప్రాధాన్యతలోనే విజయం సాధించే అవకాశం లేదు. ప్రతి రౌండ్ కు 20 వేల ఓట్లను సాధించినప్పటికీ,దాదాపు మరో 20 వేల ఓట్లు మేజిక్ ఫిగర్ కు తక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఫలితాల సరళి ప్రకారం అంచనా వేయాల్సిన లెక్కలివి.

ఇవన్నీ పరిశీలించినపుడు ప్రస్తుతం లభిస్తున్న ఆధిక్యత సరళి ప్రకారం తొలి ప్రాధాన్యతలోనే పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించే అవకాశాలు కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందువల్ల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఉత్కంఠ ఫలితాలే రావచ్చంటున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం పల్లా రాజేశ్వర్ రెడ్డి సమీప ప్రత్యర్థిగా నిలిచిన తీన్మార్ మల్లన్నకు రెండు రౌండ్లలోనూ 12 వేల పైచిలుకు ఓట్లు లభించడం గమనార్హం. ఈ లెక్కన ప్రతి రౌండ్ కూ మల్లన్నకు 12 వేల చొప్పున ఓట్లు దక్కితే, మొత్తంగా ఆయనకు లభించే ఓట్ల సంఖ్య 84 వేల ఓట్లు మాత్రమే. అంటే రెండో ప్రాధాన్యతలోనూ ఇదే ట్రెండ్ కొనసాగితే తప్ప గెలుపు అవకాశాలు తారుమారయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు.

అదేవిధంగా మూడో స్థానంలో నిలుస్తున్న టీజేఎస్ అభ్యర్థికి ప్రస్తుతం ప్రతి రౌండ్ లో తొమ్మిది వేల పైచిలుకు ఓట్లు లభించాయి. ఈ సరళి ప్రకారం లెక్కిస్తే ఏడు రౌండ్లలో కోదండరామ్ కు లభించే ఓట్ల సంఖ్య 63 వేలు మాత్రమే. రెండో ప్రాధాన్యతలో తాము పుంజుకుంటామని టీజేఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే గనుక జరిగితే రెండో ప్రాధాన్యతలో కోదండరామ్ కు మరో 1.20 లక్షలు ఓట్లు లభిస్తే తప్ప ప్రయోజనం లేదంటున్నారు. అంటే ప్రతి రౌండ్ కు 17 వేల ఓట్లపైచిలుకు ఓట్లను రెండో ప్రాధాన్యతలో సాధిస్తే తప్ప కోదండరామ్ కు విజయం లభించే అవకాశాలు లేవంటున్నారు. ఈ ప్రాతిపదికన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా ఉత్కంఠగా మారే అవకాశం ఉందంటున్నారు. రెండో ప్రాధాన్యతలోనూ ఏ అభ్యర్థికీ మేజిక్ ఫిగర్ రాకుంటే మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సైతం అనివార్యమవుతుంది. ఇదే జరిగితే, మిగతా రౌండ్లలోనూ ఇదే సరళి కొనసాగితే విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే విజయం సాధించడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version