నటుడు సోనూ సూద్ చేతికి నిజంగానే ఎముక లేనట్టుంది. చిత్తూరు జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు నాగలి లాగుతున్న సీన్ చూసి సోనూ సూద్ తీవ్రంగా చలించిన సంగతి తెలిసిందే. రైతు నాగేశ్వరరావు కుటుంబానికి ఉన్నఫళంగా ట్రాక్టర్ ను అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆ సంఘటన గురించి, సోనూ జాలి గుండె గురించి దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్న నేపథ్యంలోనే మరో ఘటనలోనూ తన ఉదారతను చాటుకున్నారు సోనూ.
కరోనా కల్లోలం, లాక్ డౌన్ పరిణామాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి దూరమై రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న టెకీ శారద గురించి ఓ న్యూస్ ఛానల్ వార్తా కథనాన్ని ప్రసారం చేసిన విషయమూ తెలిసిందే కదా? ఈ కథనం గురించి ఓ నెటిజన్ సోనూ నుంచి స్పందనను ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఇందుకు సోనూ సూద్ స్పందిస్తూ ఏమని ట్వీట్ చేశారో తెలుసా? ‘మా ప్రతినిధి తనను కలిశారు. ఇంటర్వ్యూ కూడా ముగిసింది. ఉద్యోగ లేఖ కూడా పంపించాం. జై హింద్’ అని సోనూ చేసిన ట్వీట్ ను దిగువన చూడవచ్చు. ఇప్పుడు చెప్పండి దానంలో సోనూ చేతికి ఎముక లేనట్లేగా…?