రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా? లేదా? అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ప్రశ్నించారు. అకాల వర్షాలతో అన్నదాతలు ఆక్రందనలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. రైతులకు పరిహారం ఇవ్వాలని, రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని, బ్యాంక్ రుణాలు మాఫీ చేయాలని తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ లో రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్యఅతిథిగా ఎల్.రమణ హాజరై ప్రసంగించారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆక్రందన ముఖ్యమంత్రికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. లక్షలాది ఎకరాల్లో పంట నీటి పాలైనా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టం నివేదిక రూపొందించి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంతో రాజధానిలో నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు, రైతాంగానికి ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదన్నారు . ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రాచరిక పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అకాల వర్షాల నష్టపోయిన పంటలకు సర్వే నిర్వహించి తక్షణమే పరిహారం అందించాలని రమణ డిమాండ్ చేశారు.